Parlament : నేటి నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఆగష్టు 11వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి.
- Author : Prasad
Date : 20-07-2023 - 8:48 IST
Published By : Hashtagu Telugu Desk
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఆగష్టు 11వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఢిల్లీ బ్యూరోక్రాట్‌ల బిల్లుపై రాజ్యసభలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. మణిపూర్‌లో పరిస్థితిపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజున ప్రధాని ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయనున్నాయి. లేని పక్షంలో ఉభయసభల కార్యక్రమాలను అడ్డుకుంటామని విపక్షాలు హెచ్చరించాయి. మణిపూర్‌పై చర్చకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది. మణిపూర్‌లో 80 మందికి పైగా మరణించిన 2 నెలల హింసతో సహా అన్ని విషయాలను పార్లమెంటులో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. వర్షాకాల సమావేశాల్లో 31 బిల్లులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ షెడ్యూల్‌ను రూపొందించింది. దీనిలో ఢిల్లీలో పోస్ట్ చేయబడిన బ్యూరోక్రాట్‌లను నియంత్రించే అధికారం కేంద్రానికి ఇచ్చే ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు ఉంది. మణిపూర్ లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో బయటకు వచ్చి విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనిపై విపక్షాలు ఆగ్రహంగా ఉన్నాయి. దీనిని కూడా పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చేందుకు విపక్షాలు సిద్దమైయ్యాయి. మహిళలపై సామూహిక అత్యాచారం జరిగిందని, దర్యాప్తు జరుగుతోందని రాష్ట్ర పోలీసుల ప్రకటన చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11 వరకు కొనసాగనుండగా.. మొత్తం 17 పనిదినాలలో సమావేశాలు జరగనున్నాయి. పాత పార్లమెంట్ భవనంలో సమావేశాలు ప్రారంభమయి తర్వాత కొత్త భవనానికి మారుతాయి.