Assam Elections: పాకిస్తానీ సోషల్ మీడియా తప్పుడు సమాచారాన్ని ఉపయోగించి కాంగ్రెస్ నా భార్యపై ఆరోపణలు సృష్టించింది: అస్సాం సీఎం
- Author : Vamsi Chowdary Korata
Date : 06-04-2026 - 2:36 IST
Published By : Hashtagu Telugu Desk
Narendra Modi కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాకిస్థాన్ సోషల్ మీడియా సమాచారం ఆధారంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ భారత ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ప్రతిపక్షం పాకిస్థాన్‌తో సంబంధాలు నెరుపుతోందని ఆయన ఆరోపించారు.
అసోంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, దేశ భద్రతపై ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరుకు ఇప్పటికే పలుమార్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని విమర్శించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా కాంగ్రెస్ పాకిస్థాన్ పాటనే పాడిందని మండిపడ్డారు. ఈ సంబంధం ఎప్పటి నుంచో సాగుతోందని అన్నారు. జాతీయ భద్రతకు ఇది పెను ప్రమాదమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకులపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఇటీవల రెండు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించారని, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వారు పాకిస్థాన్ సామాజిక మాధ్యమాల నుంచి తీసుకున్నట్లు గుర్తించామని ఆరోపించారు. నిన్న పవన్ ఖేరా, గౌరవ్ గొగోయ్ ఢిల్లీలో, గౌహతిలో రెండు మీడియా సమావేశాలు నిర్వహించారని తెలిపారు.
ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా వారు మాట్లాడిన సమాచారం పాక్ సోషల్ మీడియా నుంచి తీసుకున్నదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోంలో ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాకిస్థాన్ ఛానల్ 11 టాక్ షోలు నిర్వహించిందని, ఇలా ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదని తెలిపారు. ఈ ప్రతి టాక్ షోలోనూ కాంగ్రెస్ గెలవాలని పాకిస్థాన్ మీడియా కోరుకుందని వెల్లడించారు.
కాంగ్రెస్ ఆరోపణలపై ముఖ్యమంత్రి ఆగ్రహం
హిమంత బిశ్వశర్మ భార్యకు మూడు దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని, దీనితో పాటు ఆమె ఆస్తులను అఫిడవిట్లో పేర్కొనలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ ఆరోపణలపై హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా స్పందించారు. సాక్ష్యం లేకుండా తప్పుడు ఆరోపణలు చేసినందుకు కేసు నమోదు చేయవచ్చని అన్నారు. ఎన్నికల సమయంలో కావాలని ఇలాంటి ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఇందుకు కాంగ్రెస్ శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. తనపై చేసిన ఆరోపణలకు గాను తన భార్య కేసు పెట్టినట్లు హిమంత బిశ్వశర్మ తెలిపారు. పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని అన్నారు.