Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో కీలక మలుపు.. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్!
బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ అద్భుతమైన ప్రదర్శన చేసి 202 సీట్లను గెలుచుకుంది. బీజేపీ 89 సీట్లు గెలిచి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
- By Gopichand Published Date - 05:19 PM, Wed - 19 November 25
Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) బుధవారం (నవంబర్ 19) రాజ్‌భవన్‌కు వెళ్లి తన పదవికి రాజీనామా చేశారు. దీనితో పాటు ఆయన గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌కు ఎన్డీఏ (NDA) ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేసి, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి తీసుకున్నారు. ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం నితీష్ కుమార్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు.
ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో నితీష్ కుమార్ పేరును బీజేపీ నాయకుడు సమ్రాట్ చౌదరి ప్రతిపాదించారు. కొత్త ప్రభుత్వంలో సమ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా కొనసాగుతారు. సమ్రాట్ చౌదరిని బీజేపీ శాసనసభాపక్ష నేతగా, విజయ్ సిన్హాను ఉప నేతగా ఎన్నుకున్నారు. సమాచారం ప్రకారం.. స్పీకర్ పదవి బీజేపీకి దక్కనుంది.
Also Read: Aishwaryarai: ప్రధాని మోదీ పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యరాయ్.. వీడియో ఇదే!
10వ సారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్
అంతకుముందు నితీష్ కుమార్ జేడీయూ (JDU) శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. బుధవారం (నవంబర్ 19) ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన జేడీయూ ఎమ్మెల్యేల సమావేశంలో నితీష్ కుమార్‌ను ఏకగ్రీవంగా నేతగా ఎన్నుకున్నారు. నితీష్ కుమార్ 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం (నవంబర్ 20) పట్నాలోని గాంధీ మైదాన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మంగళవారం (నవంబర్ 18) నితీష్ కుమార్ స్వయంగా గాంధీ మైదాన్‌కు వెళ్లి ప్రమాణ స్వీకార ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఎన్డీఏకు మొత్తం 202 సీట్లలో విజయం
బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ అద్భుతమైన ప్రదర్శన చేసి 202 సీట్లను గెలుచుకుంది. బీజేపీ 89 సీట్లు గెలిచి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్) 85 సీట్లు గెలిచి సంఖ్యాపరంగా రెండవ స్థానంలో నిలిచింది. దీనితో పాటు చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఎల్జేపీ (ఆర్) 19 సీట్లు, హిందుస్తానీ అవామ్ మోర్చా 5 సీట్లు, ఆర్ఎల్ఎం 4 సీట్లలో విజయం సాధించాయి. మరోవైపు మహాఘట్‌బంధన్ ఘోర పరాజయాన్ని చవిచూసి కేవలం 35 సీట్లకే పరిమితమైంది.