Rahul Gandhi: మోడీ దేశద్రోహి : రాహుల్‌గాంధీ
- Author : Vamsi Chowdary Korata
Date : 20-05-2026 - 2:40 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రధాని నరేంద్ర మోదీపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ ‘దేశద్రోహి’ అని విమర్శించారు. దేశాన్ని అమ్మేశారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలీలో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఎండను సైతం లెక్కచేయకుండా వచ్చిన మీకు ధన్యవాదాలు. ఇంటికి వెళ్లాక మీ దగ్గరకు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు వచ్చి మోదీ, అమిత్ షా గురించి మాట్లాడితే దీటుగా సమాధానం ఇవ్వండి. మీ ప్రధాని, హోంమంత్రి, మీ సంస్థ దేశద్రోహులని వారికి చెప్పండి. వాళ్లు దేశాన్ని అమ్మేయడానికి పనిచేస్తున్నారని తెలియజేయండి. మన వ్యవస్థలపై దాడి చేస్తున్నారని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, అంబేడ్కర్, వీర్ పాసి, మహాత్మా గాంధీని విమర్శిస్తున్నారని చెప్పండి’’ అంటూ రాహుల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయని రాహుల్ అంచనా వేశారు. ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారని చెప్పారు. మోదీ ప్రభుత్వ వైఫల్యం వల్ల త్వరలో ఆర్థిక తుపాను రాబోతోందని పునరుద్ఘాటించారు. దీనికి మోదీ, అమిత్ షా, ఆరెస్సెస్సే కారణమన్నారు.
రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆయన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని ఆక్షేపించింది. దేశ ప్రజలను రాహుల్ అవమానిస్తున్నారంటూ మండిపడింది.