Congress : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా
Congress : మాజీ పోలీసు అధికారి అజరు కుమార్ జంషెడ్పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈయన గతంలో జంషెడ్పూర్ ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలకస్థానంలో ఉన్నారు. ప్రస్తుతం త్రిపుర, ఒడిశా, నాగాలాండ్ రాష్ట్రాలకు పార్టీ ఇంఛార్జ్గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు.
- By Latha Suma Published Date - 03:36 PM, Tue - 22 October 24

Jharkhand Assembly Elections : వచ్చేనెలలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుందని ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 21 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో గతంలో కేంద్రమంత్రిగా, ఎంపిగా, రాష్ట్రమంత్రిగా పనిచేసిన రామేశ్వర్ ఒరాన్ ఎస్టీ స్థానమైన లోహర్దగా నుంచి పోటీ చేయనున్నారు. అలాగే మాజీ పోలీసు అధికారి అజరు కుమార్ జంషెడ్పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈయన గతంలో జంషెడ్పూర్ ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలకస్థానంలో ఉన్నారు. ప్రస్తుతం త్రిపుర, ఒడిశా, నాగాలాండ్ రాష్ట్రాలకు పార్టీ ఇంఛార్జ్గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన శిల్పి నేహా టిర్కీకి కాంగ్రెస్ పార్టీ మరోసారి టికెట్ ఇచ్చింది. ఈసారి కూడా ఆమెను మందర్ (ఎస్టీ) నియోజకవర్గం నుంచి పోటీకి నిలిపింది. ఈమె తండ్రి బంధు టిర్కి జార్ఖండ్ మ్యానిఫెస్టో కమిటీకి ఛైర్మన్గా ఉన్నారు.
ఇర్ఫాన్ అన్సారి (జమత్రా), బాదల్ పత్రలేఖ్ (జాముండి), ప్రదీప్ యాదవ్ (పోరేయహత్), దీపికా పాండే సింగ్ (మహాగామా), అంబా ప్రసాద్ సాహు (బర్కాగావ్), మమతాదేవి (రామ్గఢ్), జయప్రకాశ్ పటేల్ (మాండు), మున్నా సింగ్ (హజారీబాగ్), కుమార్ జై మంగళ్ (బెర్మో), పూర్ణిమా నీరజ్ సింగ్ (ఝారియా), జలేశ్వరో మెహతో (బఘ్మారా), బన్నా గుప్తా (జంషెడ్పూర్ వెస్ట్), సోనా రామ్ సింకు (జగన్నాథ్పూర్ (ఎస్టీ)), రాజేశ్ కచాప్ (ఖిజ్రీ (ఎస్టీ), అజరు నాథ్ (హతియా), భూషణ్ బారా (సిండెగా (ఎస్టీ)), నమన్ విక్సల్ కొంగరి (కొలెబిరా (ఎస్టీ)), రామచంద్ర సింగ్ (మణిక (ఎస్టీ)లను కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించింది. కాగా, జార్ఖండ్ రాష్ట్రంలో జెఎంఎం పార్టీ అధికారంలో ఉంది. ఇండియా బ్లాక్లో భాగంగా జెఎంఎం, కాంగ్రెస్‌లు కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.