Prashant Kishor : ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయి : ప్రశాంత్ కిశోర్
బీహార్‌లో ప్రజలు అసలు ఎదుర్కొంటున్న సమస్యలు పేదరికం, నిరుద్యోగం, వలసలు, విద్యా వ్యవస్థలో లోపాలు వంటి మౌలిక సమస్యలు. కానీ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వీటిని పట్టించుకోవడం లేదు. ఓటింగ్ సమయంలో ఓట్ల కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసి ప్రజలను మాయలో పడేస్తున్నారు.
- By Latha Suma Published Date - 02:34 PM, Sun - 24 August 25

Prashant Kishor : బీహార్ రాష్ట్ర ప్రజలను తప్పుడు దారిలో నడిపిస్తూ వారి అసలైన సమస్యలను పట్టించుకోకుండా రాజకీయ లబ్ధికోసం పరస్పరం విమర్శలు చేసుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీహార్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల జీవితాలను మార్చాల్సిన బాధ్యత ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం ఓట్ల రాజకీయాన్ని మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాయని విమర్శించారు. బీహార్‌లో ప్రజలు అసలు ఎదుర్కొంటున్న సమస్యలు పేదరికం, నిరుద్యోగం, వలసలు, విద్యా వ్యవస్థలో లోపాలు వంటి మౌలిక సమస్యలు. కానీ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వీటిని పట్టించుకోవడం లేదు. ఓటింగ్ సమయంలో ఓట్ల కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసి ప్రజలను మాయలో పడేస్తున్నారు.
Read Also: Thailand : బ్యాట్‌మొబైల్‌లో వివాహానికి వచ్చిన వరుడు..నెటిజన్లు సరదా కామెంట్లు..!
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఘాటుగా స్పందించిన కిశోర్, ఆయన ఆర్జేడీ నాయకత్వ సూచనల ప్రకారమే నడుస్తున్నారని, బీహార్‌కు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. బీహార్‌కు వచ్చినప్పుడు ప్రజల సమస్యలపై మాట్లాడటం కాకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే రాహుల్ గాంధీకి ముఖ్యమవుతోంది. ఇది బీహారి ప్రజల జవాబు కాదు అని ఆయన అన్నారు. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ మధ్య పంచ్‌ల వార్ కొనసాగుతుండగా, ఇది ప్రజల దృష్టిని అసలైన సమస్యల నుండి దూరం చేస్తోందని కిశోర్ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మోడీపై, మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రజలు ఈ తప్పుడు మాటల వలలో చిక్కకూడదు అని ఆయన స్పష్టం చేశారు.
బీహార్‌లో మౌలిక సమస్యలపై ఎటువంటి చర్యలు తీసుకోని ఈ రెండు ప్రధాన పార్టీలు, గతంలో అధికారంలో ఉన్నప్పటికీ బీహార్‌ను అభివృద్ధి దిశగా తీసుకెళ్లలేదని ఆయన ఆరోపించారు. జన్ సూరజ్ పార్టీ ఏర్పాటైన దాని ఉద్దేశం కూడా ఇదేనని, ప్రజల పక్షంలో నిలబడి, వారి జీవితాల్లో వాస్తవిక మార్పులు తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. బీహార్‌లో ఉన్న యువతకు మంచి విద్య, ఉపాధి, గౌరవం కలిగిన జీవితం కల్పించడమే మా పార్టీ ప్రధాన అజెండా. బీజేపీ, కాంగ్రెస్‌లు మళ్లీ అధికారంలోకి రాకూడదనుకుంటే, ప్రజలు తమ పరిష్కారాల కోసం కొత్త మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది అని కిశోర్ పిలుపునిచ్చారు. బీహార్ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారగా, జన్ సూరజ్ పార్టీ వేరే దిశలో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: Mirai First Review: ‘మిరాయ్’ ఫస్ట్ రివ్యూ