Amit Shah : మీ పూర్వీకుల నుంచైనా నేర్చుకో రాహుల్ జీ.. నువ్వు విదేశాలకు ఎందుకెళ్లావో అందరికీ తెలుసు..
రాహుల్ గాంధీ విదేశాలకు ఎందుకు వెళ్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. భారత్‌లో వేసవి తాపాన్ని తప్పించుకునేందుకే రాహుల్ విదేశీ యాత్రలు చేస్తున్నారంటూ అమిత్ షా ఎద్దేవా చేశారు.
- By News Desk Published Date - 08:30 PM, Sat - 10 June 23

కేంద్ర మంత్రి అమిత్‌షా(Amit Shah) కాంగ్రెస్(Congress) సీనియర్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఇటీవల రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్లారు. అమెరికా(America)లోని పలు ప్రాంతాల్లో జరిగిన సమావేశాల్లో రాహుల్ పాల్గొంటూ భారత్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విషయం విధితమే. విదేశీ పర్యటనల్లో భారత అంతర్గత రాజకీయాలను ప్రస్తావిస్తుండటంపై అమిత్‌షా ఫైర్ అయ్యారు. శనివారం గుజరాత్ లో అమిత్‌షా పర్యటించారు. ఈ సందర్భంగా రాహుల్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాహుల్ జీ విదేశాల్లో భారత్ అంతర్గత రాజకీయ వ్యవహారాలపై విమర్శలు చేయడం తగదు. ఈ విషయంలో మీ పూర్వీకుల నుంచైనా నేర్చుకోవాలి అని అమిత్‌షా సూచించారు.
రాహుల్ గాంధీ విదేశాలకు ఎందుకు వెళ్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. భారత్‌లో వేసవి తాపాన్ని తప్పించుకునేందుకే రాహుల్ విదేశీ యాత్రలు చేస్తున్నారంటూ అమిత్ షా ఎద్దేవా చేశారు. మోదీ ఆధ్వర్యంలో భారత్‌లో అనేక మార్పులు వచ్చాయని, విదేశాల్లో భారతదేశం ప్రతిష్ట పెరిగిందని అన్నారు. అలాంటి సమయంలో విదేశాలకు వెళ్లిన ప్రతీసారి రాహుల్ గాంధీ భారతదేశంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని అమిత్ షా ప్రశ్నించారు. సొంత దేశాన్ని విదేశీ గడ్డపై విమర్శించడం ఏ నాయకుడికీ తగదని, ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలని అమిత్ షా సూచించారు.
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ బాయ్‌కాట్ చేయడం పట్ల అమిత్‌షా తీవ్రంగా తప్పుబట్టారు. సెంగోల్ ప్రతిష్టాపన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూనే ప్రతిష్టించాల్సి ఉంది. కానీ అలా చేయకపోవటంతో ప్రస్తుతం మోదీ హయాంలో దానిని పార్లమెంట్‌లో ప్రతిష్టించారని అమిత్ షా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ కార్యక్రమాన్ని బహిష్కరించిందని అమిత్ షా గుర్తు చేశారు. మోదీ తిమ్మిదేళ్ల హయాంలో దేశంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రపంచ దేశాలు మొత్తం భారత్ వైపే చూస్తున్నాయని అమిత్ షా చెప్పారు.
Also Read : తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలిగా డీకే అరుణ? కేంద్ర మంత్రిగా బండి ప్రమోట్?