Salt: ఉప్పు తక్కువ లేదా ఎక్కువగా తింటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే!
ఉప్పు కేవలం మన ఆహారానికి రుచిని మాత్రమే కాదు.. శరీరంలోని కీలక విధులకు కూడా చాలా ముఖ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ఒక వయోజనుడు రోజుకు 5 గ్రాముల (సుమారు ఒక టీ-స్పూన్) ఉప్పు మాత్రమే తీసుకోవాలి.
- By Gopichand Published Date - 02:45 PM, Sat - 2 August 25

Salt: అతిగా చెమటలు పట్టడం అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టే ఒక సాధారణ సమస్య. కొందరికి ఎండకాలంలో కూడా విపరీతంగా చెమటలు పడతాయి. అయితే, ఉప్పు (Salt) ఎక్కువగా తీసుకోవడం వల్ల చెమటలు పెరుగుతాయనే వాదన ఎంతవరకు నిజం? మన ఆరోగ్యానికి ఉప్పు ఎంత అవసరం? ఏ రకం ఉప్పు మంచిది? ఈ విషయాలపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
ఉప్పు, చెమట.. ఆరోగ్యం
ఉప్పు కేవలం మన ఆహారానికి రుచిని మాత్రమే కాదు.. శరీరంలోని కీలక విధులకు కూడా చాలా ముఖ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ఒక వయోజనుడు రోజుకు 5 గ్రాముల (సుమారు ఒక టీ-స్పూన్) ఉప్పు మాత్రమే తీసుకోవాలి. అయితే ఏ రకమైన ఉప్పు అయినా రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదని చెబుతున్నారు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు ఉప్పు మోతాదును మార్చుకోవచ్చు. అయితే మనిషి ఒకరోజులో సాధారణంగా 3 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోకూడదని కూడా నిపుణులు చెబుతున్నారు.
తెల్ల ఉప్పు, సైంధవ ఉప్పు, నల్ల ఉప్పు: ఏది మంచిది?
గతంలో తెల్ల ఉప్పు మాత్రమే వినియోగంలో ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో సైంధవ ఉప్పు, నల్ల ఉప్పు (బ్లాక్ సాల్ట్) ఆరోగ్యానికి మంచివని ప్రచారం జరుగుతోంది. నిపుణుల ప్రకారం.. ఈ రెండు రకాల ఉప్పులు ఆరోగ్యానికి ప్రయోజనకరమే అయినప్పటికీ తెల్ల ఉప్పు స్థానంలో వీటిని పూర్తిగా వాడటం సరైంది కాదు.
Also Read: Women Diet: 30 ఏళ్ల తర్వాత మహిళల ఆరోగ్యానికి ఆహార నియమాలీవే!
తెల్ల ఉప్పు (సాధారణ ఉప్పు): మన దేశంలో ప్రజలలో అయోడిన్ లోపాన్ని తగ్గించడానికి తెల్ల ఉప్పును అయోడిన్ కలిపి తయారు చేస్తారు. థైరాయిడ్ వ్యాధులను నివారించడానికి ఇది చాలా అవసరం.
సైంధవ ఉప్పు: ఇది మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
నల్ల ఉప్పు (బ్లాక్ సాల్ట్): జీర్ణక్రియకు ఇది చాలా మంచిది. అజీర్ణం, గ్యాస్, ఆమ్లత వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్తపోటును కూడా నియంత్రించగలదు.
ఉప్పును అకస్మాత్తుగా మార్చకూడదు
నిపుణుల ప్రకారం.. ఉప్పు మన శరీరంలోని సమతుల్యతను కాపాడుతుంది. శరీరంలోని ప్రతి అవయవం ఆరోగ్యానికి ఉప్పు అవసరం. కాబట్టి ఒక రకం ఉప్పు నుంచి మరో రకానికి అకస్మాత్తుగా మారడం ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ముఖ్యంగా కిడ్నీ, హై బీపీ, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఉప్పును మార్చాలనుకుంటే నెమ్మదిగా మార్చాలి.
ఉప్పు తినడానికి సరైన పద్ధతి
నిపుణుల సలహా ప్రకారం.. ఉప్పును సరైన మోతాదులో తీసుకోవడానికి టీ-స్పూన్ లేదా ఐదు చిటికెల ఉప్పును కొలమానంగా తీసుకోవచ్చు., ఎందుకంటే ఒక టీ-స్పూన్ సుమారు 5 గ్రాములకు సమానం. మీరు ఉప్పు రకాన్ని మార్చాలనుకుంటే వారంలో రెండు రోజులు ఒక రకం, రెండు రోజులు మరో రకం వాడవచ్చు. లేదా రెండు రకాల ఉప్పులను కలిపి కూడా ఉపయోగించవచ్చు. ఇది మీ శరీరానికి అవసరమైన ఖనిజాలు అందేలా చూస్తుంది.