యువ పారిశ్రామికవేత్తల గ్లోబల్ జాబితాలో భారత్ అగ్రస్థానం
40 ఏళ్లలోపు వయసు కలిగి, వంద మిలియన్ డాలర్లకు పైగా సంపద ఉన్న ‘సెంటీమిలియనీర్ల’ జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.
- Author : Latha Suma
Date : 22-01-2026 - 5:30 IST
Published By : Hashtagu Telugu Desk
. యూ40 సెంటీమిలియనీర్లలో భారత ప్రభావం
. బెంగళూరు ‘ఇండియాస్ యూ40 క్యాపిటల్’
. తొలితరం వ్యాపారవేత్తల పెరుగుదల, ఉపాధి సృష్టి
Indian Entrepreneurs: ప్రపంచవ్యాప్తంగా యువ పారిశ్రామికవేత్తల విషయంలో భారత్ తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. 40 ఏళ్లలోపు వయసు కలిగి, వంద మిలియన్ డాలర్లకు పైగా సంపద ఉన్న ‘సెంటీమిలియనీర్ల’ జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అవెండస్ వెల్త్ మేనేజ్‌మెంట్ హురున్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఈ జాబితాలో మొత్తం 505 మంది యువ వ్యాపారవేత్తలు ఉండగా వారిలో 201 మంది భారతీయులే కావడం విశేషం. చైనా, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాలను భారత్ వెనక్కి నెట్టి, యువ సంపన్నుల విషయంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ నివేదిక ప్రకారం చైనా నుంచి 194 మంది యూకే నుంచి 110 మంది యువ పారిశ్రామికవేత్తలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. సంఖ్యల పరంగా మాత్రమే కాకుండా కొత్త ఆలోచనలు, సాంకేతికత ఆధారిత వ్యాపార నమూనాలతో భారత యువత ప్రపంచ వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థలో మారుతున్న వ్యాపార సంస్కృతి, స్టార్టప్‌లకు అనుకూల వాతావరణం ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.
దేశంలో యువ పారిశ్రామికవేత్తలకు కేంద్ర బిందువుగా బెంగళూరు మరోసారి తన స్థానాన్ని నిలుపుకుంది. ఈ నగరం నుంచి ఏకంగా 48 మంది యువ వ్యాపారవేత్తలు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో ఉండటంతో ‘ఇండియాస్ యూ40 క్యాపిటల్’గా బెంగళూరు గుర్తింపు పొందింది. ఐటీ, స్టార్టప్ సంస్కృతి, గ్లోబల్ పెట్టుబడుల ఆకర్షణ ఈ నగరాన్ని యువ వ్యాపారవేత్తలకు స్వర్గధామంగా మార్చాయి. ఈ జాబితాలో చోటు పొందాలంటే 36 నుంచి 40 ఏళ్ల వయసు ఉండి తొలితరం పారిశ్రామికవేత్తలైతే కనీసం 100 మిలియన్ డాలర్ల వ్యాపార విలువ వారసత్వ వ్యాపారవేత్తలైతే కనీసం 200 మిలియన్ డాలర్ల సంపద ఉండాలి. ఈ ప్రమాణాలు భారత యువత వ్యాపార రంగంలో ఎంత వేగంగా ఎదుగుతోందో స్పష్టంగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ ఆధారిత రంగాల్లో భారత యువత చూపుతున్న ప్రతిభ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతోంది. భారత్‌లో పెరుగుతున్న వ్యవస్థాపక స్ఫూర్తికి ఈ నివేదిక అద్దం పడుతోంది. జాబితాలో ఉన్న భారతీయ యువ పారిశ్రామికవేత్తల్లో 83 శాతం మంది తొలితరం వ్యాపారవేత్తలే కావడం గమనార్హం.
అంటే వారసత్వ వ్యాపారాల కంటే కొత్త ఆలోచనలు, వినూత్న పరిష్కారాలతో స్వయంగా వ్యాపారాలను నిర్మించుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. రంగాల వారీగా చూస్తే సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు ఐటీ సేవల రంగం నుంచి అత్యధికంగా 40 మంది యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఆ తర్వాత హెల్త్‌కేర్ రంగం నుంచి 18 మంది, రవాణా రంగం నుంచి 16 మంది, ఆర్థిక సేవల రంగం నుంచి 15 మంది ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ యువ పారిశ్రామికవేత్తల సంస్థల మొత్తం విలువ సుమారు 357 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. అంతేకాకుండా ఈ సంస్థలు దేశవ్యాప్తంగా 4.43 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. అవెండస్ వెల్త్ మేనేజ్‌మెంట్ ఎండీ అండ్ సీఈవో అపూర్వ సాహిజ్వానీ మాట్లాడుతూ..ఈ తరం యువ పారిశ్రామికవేత్తలు ఇప్పటికే దేశ జీడీపీకి, ఉపాధి కల్పనకు కీలకంగా మారారు. వీరి విజయం రాబోయే తరాలకు ప్రేరణగా నిలుస్తుంది అని పేర్కొన్నారు. విద్యాసంస్థల పరంగా చూస్తే ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి 15 మంది పూర్వ విద్యార్థులు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండటం విశేషం. మహిళా ప్రాతినిధ్యంలో చైనా ముందుండగా భారత్ నుంచి 15 మంది మహిళా యువ పారిశ్రామికవేత్తలు ఈ జాబితాలో ఉండటం భారత వ్యాపార రంగంలో లింగ సమానత్వం దిశగా సాగుతున్న ప్రగతిని సూచిస్తోంది.