ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ నియమాల అమలు ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులలో 'ఓవర్ బిల్లింగ్' సమస్య తగ్గుతుంది. రోగి కుటుంబ సభ్యులకు తాము ఎంత ఖర్చు చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో అనే అవగాహన ఉంటుంది.
- Author : Gopichand
Date : 22-12-2025 - 6:45 IST
Published By : Hashtagu Telugu Desk
Hospitals: ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స ఎంత ఖరీదైనదో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా రోగిని వెంటిలేటర్‌పై ఉంచినప్పుడు.. ఆసుపత్రులు వేసే బిల్లులు సామాన్యులకు భారంగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో రోగుల కుటుంబాలను ఆర్థిక దోపిడీ నుండి రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ వెబ్సైట్లో ప్రైవేట్ ఆసుపత్రుల కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
కొత్త మార్గదర్శకాల ఉద్దేశ్యం
వెంటిలేటర్ వంటి ప్రాణాలను రక్షించే చికిత్సను నైతిక పద్ధతిలో అందించాలని, దానిని కేవలం డబ్బు వసూలు చేసే సాధనంగా మార్చుకోకూడదని ప్రభుత్వం ఈ నియమాలను తీసుకొచ్చింది. ఈ గైడ్‌లైన్స్ ప్రధానంగా నాలుగు సూత్రాలపై ఆధారపడి ఉన్నాయి.
స్వయంప్రతిపత్తి: రోగి లేదా వారి కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని గౌరవించడం.
రోగి శ్రేయస్సు: రోగికి మేలు చేసే పనులే చేయడం.
హాని నివారణ: అనవసరమైన లేదా సుదీర్ఘ చికిత్సల ద్వారా రోగికి హాని కలగకుండా చూడటం.
న్యాయం: వివక్ష లేకుండా అందరికీ సమానంగా చికిత్స అందించడం.
Also Read: విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల తర్వాత రోహిత్!
కీలక నిబంధనలు ఇవే
ముందస్తు అనుమతి తప్పనిసరి: వైద్యులు రోగికి మెకానికల్ వెంటిలేషన్ ప్రారంభించే ముందు వారి సంరక్షకుల నుండి స్పష్టమైన అనుమతి తీసుకోవాలి.
పూర్తి సమాచారం ఇవ్వాలి: రోగిని వెంటిలేటర్‌పై ఎందుకు ఉంచుతున్నారు? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఎదురయ్యే ప్రమాదాలు ఏమిటి? అనే విషయాలను వైద్యులు వివరించాలి.
ఖర్చుల వివరాలు: వెంటిలేటర్ చికిత్సకు మొత్తం ఎంత ఖర్చవుతుందో కుటుంబ సభ్యులకు ముందుగానే తెలియజేయాలి. అలాగే, ప్రతిరోజూ వెంటిలేటర్ మరియు ఐసీయూ సంరక్షణకు అయ్యే ఛార్జీలను కూడా స్పష్టంగా చెప్పాలి.
ధరల ప్రదర్శన: బిల్లింగ్ కౌంటర్లు, ఐసీయూ వార్డుల వెలుపల, ఆసుపత్రి వెబ్సైట్లో వెంటిలేటర్, ఇతర మెడికల్ పరికరాల ధరలను బహిరంగంగా ప్రదర్శించాలి.
వాస్తవ వినియోగానికే బిల్లు: రోగికి నిజంగా వెంటిలేటర్ వాడినప్పుడు మాత్రమే ఆ ఖర్చును బిల్లులో చేర్చాలి. అదనపు ఛార్జీలు లేదా దాచిన ఖర్చులు వసూలు చేయకూడదు.
ఫిర్యాదుల పరిష్కారం: బిల్లింగ్‌కు సంబంధించి రోగి కుటుంబ సభ్యులకు ఏవైనా ఫిర్యాదులు ఉంటే ఆసుపత్రి యాజమాన్యం నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించాలి.
ఈ మార్పు వల్ల ప్రయోజనం ఏమిటి?
ఈ నియమాల అమలు ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులలో ‘ఓవర్ బిల్లింగ్’ సమస్య తగ్గుతుంది. రోగి కుటుంబ సభ్యులకు తాము ఎంత ఖర్చు చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో అనే అవగాహన ఉంటుంది. దీనివల్ల వైద్య సేవల్లో పారదర్శకత పెరగడమే కాకుండా, రోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుంది.