క్రికెట్ చరిత్రలో మొదటి సూపర్ ఓవర్ ఎప్పుడు జరిగిందో తెలుసా?
అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి తొలి సందర్భం 2024లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2026లో దక్షిణాఫ్రికా- ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఈ టోర్నీలోనే మొదటి డబుల్ సూపర్ ఓవర్ థ్రిల్లర్‌ను ఆడాయి.
- Author : Gopichand
Date : 11-02-2026 - 9:15 IST
Published By : Hashtagu Telugu Desk
Super Over: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఈరోజు దక్షిణాఫ్రికా- ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. క్రికెట్ అభిమానులు మరోసారి మైదానంలో హై-వోల్టేజ్ డ్రామాను వీక్షించారు. ఈ నేపథ్యంలో అసలు క్రికెట్ చరిత్రలో సూపర్ ఓవర్ నియమం ఎప్పుడు మొదలైంది? ఈ నియమం ఎలా పుట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రికెట్ చరిత్రలో మొదటి సూపర్ ఓవర్
అంతర్జాతీయ క్రికెట్లో మొట్టమొదటి సూపర్ ఓవర్ 26 డిసెంబర్ 2008న ఆక్లాండ్‌లో జరిగింది. న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఇరు జట్లు 155 పరుగుల వద్ద సమానంగా నిలిచాయి (టై). విజేతను నిర్ణయించడానికి మొదటిసారిగా సూపర్ ఓవర్ నియమాన్ని ఉపయోగించారు. ఈ చారిత్రాత్మక క్షణం పరిమిత ఓవర్ల క్రికెట్లో ఒక కొత్త యుగానికి నాంది పలికింది.
Also Read: ఉదయం మీరు కూడా ఇలాంటి తప్పులు చేస్తున్నారా?
సూపర్ ఓవర్ నియమం ఎందుకు రూపొందించబడింది?
సూపర్ ఓవర్ రాకముందు టీ20 క్రికెట్లో మ్యాచ్ టై అయితే ‘బౌల్ అవుట్’ పద్ధతి ద్వారా విజేతను నిర్ణయించేవారు. బౌల్ అవుట్లో బ్యాటర్లు లేకుండానే బౌలర్లు స్టంప్స్‌ను నేరుగా హిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫుట్‌బాల్‌లోని పెనాల్టీ షూటవుట్ లాంటిది. అయితే బౌల్ అవుట్ పద్ధతి క్రికెట్లోని అసలైన నైపుణ్యాలను (బ్యాటింగ్, ఫీల్డింగ్) ప్రతిబింబించదని చాలా మంది ఆటగాళ్లు, అభిమానులు భావించారు. ఈ ఆందోళనలను తొలగించడానికి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 2008లో సూపర్ ఓవర్ నియమాన్ని ప్రవేశపెట్టింది. దీని ఉద్దేశ్యం ఒక ఓవర్‌తో కూడిన ‘మినీ మ్యాచ్’ను నిర్వహించడం ద్వారా ఆటలోని పోటీతత్వాన్ని కాపాడటం.
ఐపీఎల్లో సూపర్ ఓవర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ నియమాన్ని చాలా త్వరగా స్వీకరించింది. ఐపీఎల్లో మొదటి సూపర్ ఓవర్ 2009లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది.
డబుల్ సూపర్ ఓవర్ ఆవిర్భావం
అరుదైన సందర్భాల్లో సూపర్ ఓవర్ కూడా టై అయితే మ్యాచ్ రెండో సూపర్ ఓవర్‌కు వెళ్తుంది. దీనినే డబుల్ సూపర్ ఓవర్ అని పిలుస్తారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి తొలి సందర్భం 2024లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2026లో దక్షిణాఫ్రికా- ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఈ టోర్నీలోనే మొదటి డబుల్ సూపర్ ఓవర్ థ్రిల్లర్‌ను ఆడాయి. బౌల్ అవుట్ స్థానంలో వచ్చిన సూపర్ ఓవర్, ప్రపంచకప్‌లు, టీ20 లీగ్‌లలో మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చడమే కాకుండా టై అయిన మ్యాచ్‌ల ఫలితాలను నిర్ణయించే విధానాన్ని పూర్తిగా మార్చేసింది.