Krishna River Water : చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన వైఎస్ జగన్.!
- By Vamsi Chowdary Korata Published Date - 04:25 PM, Fri - 21 November 25
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారు. కృష్ణా నదీజలాల్లో తెలంగాణ ప్రభుత్వం 763 టీఎంసీల వాటా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఏపీ ప్రజల హక్కులను కాపాడేలా ప్రభుత్వం వ్యవహరించాల్సిన సమయం వచ్చిందంటూ వైఎస్ జగన్ లేఖ రాశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడేలా వాదనలు వినిపించాలని.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీలలో ఒక్క టీఎంసీ నీరు కోల్పోయినా.. అందుకు టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వైఎస్ జగన్ హెచ్చరించారు.
కృష్ణా నదీజలాల పంపిణీపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు.. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. కృష్ణా నదీజలాల వివాదంపై ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ ప్రజల హక్కులను కాపాడేలా ప్రభుత్వం వాదనలు వినిపించాలని కోరారు. ఈ సమయంలోనే కొన్ని అంశాలను వివరిస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. చంద్రబాబుకు లేఖ రాశారు.కృష్ణా నదీజలాలకు సంబంధించి ఏపీ హక్కులను కాపాడటంలో టీడీపీ ఎప్పుడూ నిజాయతీగా వ్యవహరించలేదని వైఎస్ జగన్ విమర్శించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వచ్చే విచారణలలో రాష్ట్ర ప్రజల హక్కు లను కాపాడేలా వాదనలు వినిపించాలని ఏపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరారు.
Summary of my letter to @ncbn garu – https://t.co/auYnTgKUvo
The Government of AP will have an opportunity to present its case in the upcoming hearings before the KWDT – II. This is of vital importance in the light of the Telangana Government’s demand for allocation of 763 TMC…
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 21, 2025
కృష్ణా నదిలో 763 టీఎంసీల నీటిని తెలంగాణ రాష్ట్రం తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల తరుఫున బలమైన వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థనను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంగీకరిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తన తుది వాదనలను సమర్పించి.. ఈ అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మరోవైపు రాయలసీమ ప్రాజెక్టుల పట్ల టీడీపీ నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తోందని వైఎస్ జగన్ ఆరోపించారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచే పనులు.. 1996లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మొదలయ్యాయని వైఎస్ జగన్ ఆరోపించారు. ఆ సమయంలో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఉన్నారని వైఎస్ జగన్ గుర్తు చేశారు.
ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్షపార్టీలు ఆందోళనలు చేసినా.. చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్రం పట్ల నిజాయితీ లేకుండా వ్యవహరించడంతో.. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును పెంచడానికి కర్ణాటకకు అనుమతి ఇచ్చిందని వైఎస్ జగన్ ఆరోపించారు. అలాగే 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలపై రాష్ట్ర హక్కులను కూడా తెలంగాణకు వదులుకుందని వైఎస్ జగన్ విమర్శించారు.
ఇప్పుడు మరోసారి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కృష్ణా నదీజలాల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలని.. ఈ కీలక సమయంలో, టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రం పట్ల నిబద్ధతతో వ్యవహరించి, కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడాలని వైఎస్ జగన్ కోరారు. బచావత్ ట్రిబ్యునల్ ఏపీకి కేటాయించిన 512 టీఎంసీల నికర నీటిలో ఒక్క టీఎంసీ కోల్పోయే పరిస్థితి తలెత్తినా, దానికి టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడేందుకు ఇదే మంచి అవకాశమని వైఎస్ జగన్ సూచించారు.
మరోవైపు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ప్రస్తుతం ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నీరు కేటాయిస్తున్నారు. అయితే కృష్ణా నదీ పరివాహక ప్రాంతం తెలంగాణలో 70 శాతం ఉంటే.. ఏపీలో 30 శాతం మాత్రమే ఉందని.. దాని ఆధారంగా నదీజలాలు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. అయితే ఇప్పుడు ఉన్న నిష్పత్తినే కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది.