YCP: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక బిల్లుపై వైసీపీ తీవ్ర అభ్యంతరం!
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే 18% అదనంగా వసూలు చేస్తున్నారని దీనిపై జీఎస్టీ కౌన్సిల్‌లో మాట్లాడమని తాము ప్రభుత్వాన్ని కోరామని బొత్స అన్నారు.
- By Gopichand Published Date - 04:59 PM, Mon - 22 September 25

YCP: ఆంధ్రప్రదేశ్‌లో కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ (YCP) సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక బిల్లుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం ఒకే కలంపోటుతో కార్మికుల హక్కులను తొలగించడం సరికాదని ఆయన అన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత కార్మికులు సాధించుకున్న హక్కులను ఈ బిల్లు ఎలా కాలరాస్తుందని ఆయన ప్రశ్నించారు. కార్మికుల పనిగంటలను 8 నుంచి 12 గంటలకు పెంచడంపైనా తాము సభలో ప్రశ్నించామని, అయినా ప్రభుత్వం స్పందించలేదని ఆయన పేర్కొన్నారు.
బిల్లుపై వాకౌట్
కార్మికుల పనిగంటలను పెంచే అంశంపై ప్రభుత్వం అంత హడావుడిగా ఎందుకు నిర్ణయం తీసుకుందో అర్థం కావట్లేదని బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ బిల్లులో మహిళా కార్మికుల రక్షణపై కూడా స్పష్టత లేదని ఆయన విమర్శించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా తాము అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశామని ఆయన తెలిపారు. కార్మికుల హక్కులను కాలరాసే ఈ బిల్లును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: They Call Him OG Trailer: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ విడుదల.. బాంబే వస్తున్నా.. తలలు జాగ్రత్త!
జీఎస్టీపై స్పందన
కార్మిక బిల్లుతో పాటు జీఎస్టీ అంశంపై కూడా బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని విమర్శించారు. జీఎస్టీపై తాము మాట్లాడటానికి ప్రయత్నిస్తే ప్రభుత్వం తమకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. కనీసం తమ సూచనలు, సలహాలు కూడా ప్రభుత్వం తీసుకోలేదని ఆయన అన్నారు. ‘చపాతీ, రోటీపై జీఎస్టీ లేదు. మరి ఇడ్లీ, దోశపై ఉందా?’ అని అడిగితే ప్రభుత్వానికి సరైన సమాధానం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
ఆన్‌లైన్ ఫుడ్, చేనేత కార్మికులపై జీఎస్టీ
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే 18% అదనంగా వసూలు చేస్తున్నారని దీనిపై జీఎస్టీ కౌన్సిల్‌లో మాట్లాడమని తాము ప్రభుత్వాన్ని కోరామని బొత్స అన్నారు. అలాగే చేనేత కార్మికులకు అవసరమైన ముడి సరుకులపై జీఎస్టీని తొలగించమని అడిగినా ప్రభుత్వం స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నోట్‌ను చదివి వెళ్లిపోవాలన్నట్టుగా ప్రభుత్వం తమ పట్ల వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.