Ursa Organization: వైసీపీ అవాస్తవాలను ఖండించిన ఉర్సా సంస్థ!
ఉర్సా క్లస్టర్స్ తమ సంస్థపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను నిరాధారమైనవిగా ఖండించింది. రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకొస్తున్న తమ ప్రయత్నాలను అడ్డుకునేందుకు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించింది.
- By Gopichand Published Date - 12:56 PM, Wed - 23 April 25

Ursa Organization: ఉర్సా క్లస్టర్స్ సంస్థ (Ursa Organization) వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. సంస్థ ఫౌండర్ జై తాళ్లూరి జూమ్ కాల్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నాలను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో తాము ముందుకొస్తుంటే, నిరాధారమైన నిందలు వేస్తున్నారని అన్నారు.
ఉర్సా సంస్థ గురించి కీలక వివరాలు
ఉర్సా క్లస్టర్స్ అమెరికాలో రిజిస్టర్ అయిన సంస్థ, భారతదేశంలో పెట్టుబడుల కోసం హైదరాబాద్‌లో తాత్కాలిక చిరునామాతో 2025 ఫిబ్రవరి 12న రిజిస్టర్ అయింది. ఇది రాత్రికి రాత్రి పుట్టిన సంస్థ కాదని, వందలాది మంది ఉద్యోగుల కఠోర శ్రమతో ఏర్పడిందని జై తాళ్లూరి స్పష్టం చేశారు. రూ.5,728.3 కోట్ల పెట్టుబడితో మూడు దశల్లో 300 మెగావాట్ల సామర్థ్యంతో 2,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో విశాఖపట్నంలో ప్రాజెక్టు చేపడుతున్నారు. ఆర్‌బీఐ ఆమోదించిన FDI పాలసీ ప్రకారం నిబంధనలు పాటిస్తున్నారు.
ఎకరం రూ.50 లక్షల చొప్పున 56.6 ఎకరాలు, ఎకరం రూ.1 కోటి చొప్పున 3.5 ఎకరాలు కేటాయించారు. రూ.99 పైసలకు ఎకరం ఇచ్చారనే వైసీపీ ఆరోపణలు అవాస్తవమని, ప్రభుత్వ పాలసీ ప్రకారమే భూమి కేటాయింపు జరిగిందని స్పష్టం చేశారు. ప్రభుత్వం 2 సంవత్సరాల గడువు విధించింది. కార్యకలాపాలు ప్రారంభించకపోతే, భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని ప్రాజెక్టును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది.
Also Read: Terrorists: పహల్గామ్ దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు పాల్గొన్నారు?
టీమ్ అనుభవం, నిందలపై స్పందన
జై తాళ్లూరి తమ టీమ్‌లో సతీష్ అబ్బూరి, ఎరిక్ వార్నర్, కౌశిక్ పెందుర్తి వంటి దశాబ్దాల అనుభవం ఉన్న సభ్యులున్నారని, టెక్నాలజీ ఎంటర్‌ప్రైజెస్‌లో వారి నైపుణ్యాన్ని తప్పుడు ఆరోపణలతో కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమానాలుంటే NDA సంతకంతో సంస్థ వివరాలు తెలుసుకోవచ్చని, రాజకీయ లబ్ధి కోసం విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
కేశినేని చిన్నితో సంబంధం లేదు
సతీష్ అబ్బూరి, ఎంపీ కేశినేని చిన్నికి ఉర్సా సంస్థతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేశినేని నాని తమపై బురద జల్లుతున్నారని, AI రంగంలో సంస్థ స్థాయి, టర్నోవర్ గురించి నిజాలు తెలుసుకోవాలని సూచించారు. ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగమని జై తాళ్లూరి ఆరోపించారు. ఇలాంటి నిందలతో కొత్త కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకుండా వెనక్కి వెళ్లేలా చేయాలనే దురుద్దేశంతో ఈ ప్రచారం సాగుతోందని అన్నారు.
ఉర్సా క్లస్టర్స్ తమ సంస్థపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను నిరాధారమైనవిగా ఖండించింది. రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకొస్తున్న తమ ప్రయత్నాలను అడ్డుకునేందుకు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించింది. సంస్థ లక్ష్యం యువతకు ఉపాధి కల్పించడమేనని, అన్ని నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా పనిచేస్తామని స్పష్టం చేసింది.