Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరికి అరుదైన గౌరవం.. అవార్డుపై నందమూరి రామకృష్ణ హర్షం!
"సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు" అనే ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకుని నడుస్తున్న భువనేశ్వరి ఇటువంటి ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక కావటం గర్వకారణమన్నారు.
- By Gopichand Published Date - 09:24 PM, Mon - 13 October 25

Nara Bhuvaneshwari: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత నందమూరి తారకరామారావు కుమార్తె నారా భువనేశ్వరికి (Nara Bhuvaneshwari) లభించిన ప్రతిష్టాత్మక ‘డిస్టింగ్యిష్ ఫెలోషిప్’ (Distinguished Fellowship) అవార్డుపై ఆమె సోదరుడు నందమూరి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆమె ప్రతిభకు, సమాజ సేవకు నిదర్శనమని ఆయన కొనియాడారు.
లండన్ సంస్థ నుంచి అరుదైన అవార్డు
నారా భువనేశ్వరికి లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (Institute of Directors) సంస్థ ఈ ‘డిస్టింగ్యిష్ ఫెలోషిప్’ అవార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో నందమూరి రామకృష్ణ సోమవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ “మా నందమూరి ఇంట మహాలక్ష్మి, నారా వారి గృహలక్ష్మి, మహిళా లోకానికి ప్రియమైన ఆడపడుచు నారా భువనేశ్వరికి అవార్డు రావటం ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు.
Also Read: Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌పై ప్రశంసలు కురిపించిన టీమిండియా మాజీ క్రికెటర్!
భువనేశ్వరి సేవలను కొనియాడిన రామకృష్ణ
భువనేశ్వరి ప్రజలకు, సమాజానికి అందిస్తున్న సేవలను రామకృష్ణ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమ తండ్రి ఎన్టీఆర్ పేరిట స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదాన ప్రాధాన్యతను చాటుతూ ఎంతో మంది ప్రాణాలను కాపాడారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ ద్వారా అనాథ, పేద పిల్లలను చేరదీసి వారికి ఉచితంగా విద్యను అందించి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడం వంటి సేవలు వెలకట్టలేనివని తెలిపారు. మరోవైపు, వ్యాపార రంగంలో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను విజయవంతంగా ముందుకు నడిపిస్తూ ఆమె అందిస్తున్న సేవలను కూడా గుర్తు చేశారు. భువనేశ్వరి సేవలను గుర్తించి లండన్ సంస్థ ఈ అత్యుత్తమ అవార్డును అందించాలని నిర్ణయించడం ఆమె కృషికి లభించిన నిజమైన గౌరవమని ఆయన అభిప్రాయపడ్డారు.
మహనీయుల సరసన స్థానం
గతంలో ఈ ‘డిస్టింగ్యిష్ ఫెలోషిప్’ అవార్డును దివంగత రాష్ట్రపతి, మిస్సైల్‌మెన్ అబ్దుల్ కలాం, కిరణ్ బేడీ వంటి మహనీయులు అందుకున్నారని రామకృష్ణ గుర్తు చేశారు. అటువంటి ప్రముఖుల సరసన తమ సోదరి నిలబడటం నందమూరి, నారా కుటుంబాల ప్రతిష్టను మరింత పెంచిందని గర్వంగా ప్రకటించారు.
సువర్ణాధ్యాయం లిఖించుకోవాలని ఆకాంక్ష
“సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు” అనే ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకుని నడుస్తున్న భువనేశ్వరి ఇటువంటి ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక కావటం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ, సేవారంగంలో పునీతమై, ఎన్టీఆర్ కుమార్తెగా, సీఎం చంద్రబాబు సతీమణిగా చరిత్రలో తనకంటూ ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించుకోవాలని నందమూరి రామకృష్ణ ఆకాంక్షించారు.