చంద్రబాబు మీద అనుచిత వాక్య పై మా మామ అంబటి రాంబాబు బాధపడుతున్నారు: అల్లుడు ఉపేష్
- Author : Vamsi Chowdary Korata
Date : 03-02-2026 - 11:42 IST
Published By : Hashtagu Telugu Desk
Ambati Rambabu ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యల పట్ల అంబటి రాంబాబు బాధపడుతున్నారని ఆయన అల్లుడు ఉపేష్ అన్నారు. అంబటిని ముందు టీడీపీ శ్రేణులే రెచ్చగొట్టాయని… ఈ క్రమంలోనే ఆయన ఆవేశంలో నోరు జారారని చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటితో నిన్న ఉపేష్ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అంబటికి సినిమా చూపిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనడం సరికాదని ఉపేష్ అన్నారు. ముఖ్యమంత్రిపై అనుచితంగా మాట్లాడితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలే కానీ… ఇళ్లపై దాడి చేసే సంస్కృతిని ప్రోత్సహించకూడదని చెప్పారు.
తమ ఇంటిపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి, ఆమె భర్త, అనుచరులు కలిసి దాడి చేశారని… మొత్తం సీసీ టీవీలో రికార్డయిందని తెలిపారు. పెమ్మసాని, మాధవికి కూడా కుటుంబ సభ్యులు ఉన్నారని… ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. పద్ధతి మార్చుకోకపోతే ఇదే ఘటన భవిష్యత్తులో పునరావృతమవుతుందని వ్యాఖ్యానించారు.