Minister Lokesh: రేపు విశాఖకు మంత్రి లోకేష్.. ఎందుకంటే?
విశాఖను డేటా సెంటర్ల హబ్‌గా మార్చాలనే లోకేష్ కృషి ఫలితంగా ఇప్పటికే అనేక దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. టీసీఎస్ 2 గిగావాట్లు, గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ 1 గిగావాట్ మరియు సిఫీ 450 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి.
- By Gopichand Published Date - 12:58 PM, Sat - 11 October 25

Minister Lokesh: ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) చొరవతో విశాఖపట్నం త్వరలో డేటా సెంటర్ల హబ్‌గా రూపుదిద్దుకోనుంది. ఏకంగా 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న లోకేష్ ఈ దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
రేపు సిఫీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన
ఈ ప్రయత్నంలో భాగంగా అక్టోబర్ 12వ తేదీ ఆదివారం నాడు మంత్రి నారా లోకేష్ విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సిఫీ (Sify) ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ (CLS)కు ఆయన శంకుస్థాపన చేస్తారు. నాస్‌డాక్‌లో నమోదైన దేశ ప్రముఖ డిజిటల్ ఐసీటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ (Sify Infinit Spaces Limited) ఈ 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్‌ను నిర్మించనుంది.
రూ. 1,500 కోట్ల పెట్టుబడి, వెయ్యికి పైగా ఉద్యోగాలు
రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాల భూమిలో రూ. 1,500 కోట్ల భారీ పెట్టుబడితో సిఫీ ఈ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌ను రెండు దశల్లో అభివృద్ధి చేయనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాకతో విశాఖ భారతదేశ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్ వేగా రూపుదిద్దుకోవడంతో పాటు సముద్రపు కేబుల్ కనెక్టివిటీ, ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది.
Also Read: Spiritual: ఇంట్లో ఈ నాలుగు ఉంటే చాలు.. లక్ష్మీ అనుగ్రహం మీకు కలిగినట్టే!
విశాఖ వ్యూహాత్మక సీఎల్ఎస్ పాయింట్‌గా
నూతనంగా ఏర్పాటు చేయనున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ (CLS) సదుపాయం సముద్రపు కేబుల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఈ సీఎల్ఎస్ ద్వారా భారతదేశంతో పాటు ఆగ్నేయాసియాలోని సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయిలాండ్ వంటి దేశాల మధ్య వేగంగా డేటా ప్రాసెసింగ్ చేయబడుతుంది. దీంతో విశాఖ వ్యూహాత్మక ల్యాండింగ్ పాయింట్‌గా పనిచేస్తుంది.
ప్రపంచంలోనే నంబర్ 1 స్థానం లక్ష్యం
విశాఖను డేటా సెంటర్ల హబ్‌గా మార్చాలనే లోకేష్ కృషి ఫలితంగా ఇప్పటికే అనేక దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. టీసీఎస్ 2 గిగావాట్లు, గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ 1 గిగావాట్ మరియు సిఫీ 450 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి. ఈ భారీ పెట్టుబడులతో విశాఖ మొత్తం సామర్థ్యం 3.5 గిగావాట్లకు చేరి, ప్రస్తుతం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న అమెరికాలోని వర్జీనియా (1.3 గిగావాట్లు)ను అధిగమించి, ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపనుంది. ఈ పరిణామాలతో రానున్న ఐదేళ్లలో లక్షన్నర మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయని ఐటీ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.