Heavy Rains In AP: ఏపీలోని ఐదు జిల్లాలకు వరద ముప్పు.. నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు వాతావరణ శాఖ కురుస్తాయన్న హెచ్చరికలతో నేడు (గురువారం) పలు జిల్లాల్లోని స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు.
- By Gopichand Published Date - 12:36 AM, Thu - 17 October 24

Heavy Rains In AP: ఏపీలోని ఐదు జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో (Heavy Rains In AP) వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో గురువారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తీవ్ర వాయుగుండం కారణంగా తమిళనాడు, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. గురువారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్షాలకు నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
వాయుగుండం కారణంగా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు వాతావరణ శాఖ కురుస్తాయన్న హెచ్చరికలతో నేడు (గురువారం) పలు జిల్లాల్లోని స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రేపు సెలవు ఉండనుంది. పలు జిల్లాల్లో కలెక్టర్లు సెలవు ప్రకటించినా విద్యాసంస్థలు నడపటంపై విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలోని పలు జిల్లాలకు రెండు రోజుల వర్ష సూచన
తెలంగాణలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ, మెదక్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, మహబూబాబాద్, సూర్యాపేట, మహబూబ్ నగర్, గద్వాల్, నారాయణపేట, వికారాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, హైదరాబాద్, మేడ్చల్, వనపర్తి, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, ములుగు, జనగాం, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కూడా సూచించింది.