IT Minister Sridhar Babu: సెమీ కండక్టర్ మిషన్ కింద రాష్ట్రానికి ప్రాధాన్యతనివ్వాలి: మంత్రి శ్రీధర్ బాబు
వచ్చే పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆర్థిక వ్యవస్థగా తెలంగాణాను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం పది బిలియన్ డాలర్ల ఎకానమీ సాధనలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం ప్రముఖంగా ఉంటుందని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.
- By Gopichand Published Date - 12:23 AM, Thu - 17 October 24

IT Minister Sridhar Babu: దేశంలో స్మార్ట్ ఫోన్లు, విద్యుత్తు వాహనాలు, ఇంటర్నెట్ కనెక్షన్లు భారీగా పెరగుతున్న నేపథ్యంలో సెమీ కండక్టర్ అవసరాలు విస్తృతమయ్యాయని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (IT Minister Sridhar Babu) పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగదారులు 100 కోట్లకు, విద్యుత్ వాహనాలు కోటికి, ఇంటర్నెట్ కనెక్షన్లు 200 కోట్లకు చేరుకున్నాయని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో బుధవారం నాడు జరిగిన ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ స్టాండర్డేజేషన్ అసెంబ్లీ-2024 సమావేశంలో ప్రసంగించారు. ఇందులో ముఖ్య అతిథులుగా కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని పాల్గొన్నారు. సమావేశానికి పలు రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులు హాజరయ్యారు.
రాష్ట్రంలో స్టార్టప్ లకు అనుకూల వాతావరణం కల్పించామని, మౌలిక వసతుల విషయంలో అగ్రగామిగా ఉన్నామని శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణాలో ఇప్పటికే పలు దిగ్గజ ఐటీ సంస్థలు కార్యాలయాలు నెలకొల్పాయని వివరించారు. ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ కింద అడ్వాన్స్‌డ్ ప్యాకేజింగ్ , మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ యూనిట్లను తెలంగాణాలో స్థాపించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు.
కృత్రిమ మేథ, సెమీకండక్టర్ రంగంల్లో నైపుణ్యం ఉన్న 3.5 లక్షల మంది ప్రతిభావంతులు ఉన్నందున తెలంగాణాకు ప్రాధాన్యతనివ్వాలని ఆయన కోరారు.
వచ్చే పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆర్థిక వ్యవస్థగా తెలంగాణాను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం పది బిలియన్ డాలర్ల ఎకానమీ సాధనలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం ప్రముఖంగా ఉంటుందని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. సెమీకండక్టర్ రంగంలో తెలంగాణ దేశానికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉంది. ఎన్విడియా, క్వాల్ కామ్, బ్రామ్ కామ్ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు, గ్లోబల్, లోకల్ మార్కెట్ల కోసం పనిచేసే స్టార్టప్‌లతో ముందుకు దూసుకెళ్తున్నామని వెల్లడించారు.
టీ ఫైబర్ ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, దీని పూర్తి స్థాయిలో అమలు కోసం కేంద్రం ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ రాష్ట్రంలోని 80 లక్షల కుటుంబాలకు హైస్టీడ్ ఇంటర్నెట్, మల్టీ-ప్లే సేవలు అందించడం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సేవలను నెలకు కేవలం ₹300 రూపాయలకే ఇవ్వడం వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఐటీ పరంగా విప్లవాత్మక మార్పులు తీసుకురాగలుగుతామని చెప్పారు. డిజిటల్ కనెక్టివిటీ అంటే కేవలం ఇంటర్నెట్ అందించడం మాత్రమే కాదు. ఇది గ్రామీణ వ్యాపార వృద్ధి, విద్య, వైద్య సేవల లభ్యతను మరింతగా పెంచడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం అవుతుందని అన్నారు.