YS Sharmila Comments: మహిళలపై అఘాయిత్యాలలో ఏపీ ప్రథమ స్థానం.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను అరికట్టడంలో గత 10 ఏళ్లుగా టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆమె పేర్కొన్నారు.
- Author : Gopichand
Date : 18-11-2024 - 6:13 IST
Published By : Hashtagu Telugu Desk
YS Sharmila Comments: ఏపీలో రాజకీయం రోజుకో అంశంపై వార్తల్లో నిలుస్తోంది. మొన్నటి వరకు మహిళలపై అత్యాచారాలు, హత్యలు అనే అంశాల చుట్టూ కూటమి పార్టీలకు, పత్రిపక్ష పార్టీలక మధ్య వివాదం నడిచింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో తప్పుగా పోస్టులు పెట్టేవారిపై కూటమి ప్రభుత్వం పలు రకాల కఠిన చర్యలు తీసుకుంటుంది. బోరుగడ్డ అనిల్ కుమార్ దగ్గర నుంచి నటి శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వరకు ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేస్తూ వారికి ఝలక్‌లు ఇస్తుంది. తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila Comments) మహిళల భద్రత విషయంలో టీడీపీ, వైసీపీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఎక్స్ (గతంలో ట్విట్టర్) ద్వారా టీడీపీ, వైసీపీలపై విమర్శలు గుప్పించారు.
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను అరికట్టడంలో గత 10 ఏళ్లుగా టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆమె పేర్కొన్నారు. ఇవ్వాళ శాసనమండలిలో జరిగిన చర్చనే ఇందుకు నిదర్శనమని తెలిపారు. 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో నమోదైనవి 83,202 కేసులట. 2019 నుంచి 24 వరకు 1,00,508 కేసులట. తమ పాలనలో కంటే వైసీపీ హయాంలోనే 20 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయని టీడీపీ… లేదు లేదు కూటమి అధికారంలో వచ్చాకే రోజుకు సగటున 59 అత్యాచారాలు నమోదు అని వైసీపీ.. మహిళల మానప్రాణాల మీద రాజకీయాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
Also Read: Deputy Mayor: ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: డిప్యూటీ మేయర్
గడిచిన 10 ఏళ్లలో సుమారు 2 లక్షల కేసులు నమోదు అయ్యాయంటే.. మహిళలకు భద్రత కల్పించడంలో మన రాష్ట్రం ఎక్కడుందో అర్థమవుతుందని ఆమె దుయ్యబట్టారు. మహిళలపై క్రైమ్ రేట్ అరికట్టలేని వైసీపీ, టీడీపీలు రెండు దొందు దొందే అని ఎద్దేవా చేశారు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయమని, సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని అన్నారు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు పేరుకే తప్పా అమలుకు నోచుకోలేదని ఆమె ఆరోపించారు.
నిర్భయ చట్టం ప్రకారం మహిళలపై వికృత చేష్టలకు పాల్పడితే 40 రోజుల్లో కఠిన శిక్షలు అని చంద్రబాబు, దిశ చట్టం కింద 20 రోజుల్లోనే ఉరి శిక్ష పడేలా చర్యలని జగన్ మహిళల చెవుల్లో క్యాలి ఫ్లవర్లు పెట్టారు తప్పిస్తే… చట్టాలను అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. భద్రతకు పెద్ద పీట అని ఆర్భాటపు ప్రచారాలు తప్పా.. 10 ఏళ్లలో ఏ ఒక్క నేరస్థుడికీ కఠిన శిక్షలు పడలేదన్నారు. కేసులు చేధించాల్సిన పోలీసులను కక్ష్య సాధింపు రాజకీయాలకు వాడుతున్నారు తప్పిస్తే.. ఏనాడూ సక్రమంగా విధులు నిర్వర్తింపజేసింది లేదని విమర్శించారు. అభివృద్ధిలో చివరి స్థానం.. మాదక ద్రవ్యాల వాడకంలో, మహిళలపై అఘాయిత్యాలలో, ప్రథమ స్థానం. ఇది మన రాష్ట్ర దుస్థితి అని ఆమె బాధపడ్డారు.