Amaravati ORR : అమరావతి ఓఆర్ఆర్.. ఎలైన్‌మెంట్, డీపీఆర్‌పై కొత్త అప్‌డేట్
గరిష్ఠంగా ఎన్ని యాక్సిల్స్ వాహనాలు(Amaravati ORR).. అత్యధికంగా ఎంత లోడుతో.. అమరావతి ఓఆర్ఆర్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది అనే దానిపై సర్వే చేస్తున్నారు.
- By Pasha Published Date - 09:24 AM, Mon - 4 November 24

Amaravati ORR : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించిన ఔటర్ రింగ్‌రోడ్ (ఓఆర్‌ఆర్)తో ముడిపడిన పనులు వేగాన్ని పుంజుకున్నాయి. దీని నిర్మాణానికి అవసరమైన 3వేల హెక్టార్ల భూమిని సేకరించేందుకు అయ్యే ఖర్చంతా భరించేందుకు కేంద్ర సర్కారు ఓకే చెప్పింది. దీంతో 189 కి.మీ మేర విస్తరించి ఉండే అమరావతి ఓఆర్‌ఆర్‌కు ఎలైన్‌మెంట్ ఖరారుతో పాటు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) తయారీ పనులను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు మొదలుపెట్టారు. ఇటీవలే సలహా సంస్థ ఆర్వీ అసోసియేట్స్‌తో కలిసి వారు పనులు ఆరంభించారు. సర్వే పనులు పూర్తిచేసి.. ఏడాదిలోగా డీపీఆర్ తయారీ ప్రక్రియను పూర్తిచేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.
Also Read :Nails Weak And Stained: గోళ్ళపై తెలుపు, పసుపు మచ్చలు ఈ విటమిన్ల లోపానికి సంకేతం!
ఓఆర్ఆర్ పరిధిలో చేస్తున్న సర్వేలు ఇవీ..
- హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, మచిలీపట్నం, అనంతపురం తదితర మార్గాల వైపు నుంచి వచ్చే వాహనాలు అమరావతి ఓఆర్‌ఆర్‌లో ఎక్కడ ప్రవేశించి, ఎంత దూరం వెళ్లి ఇతర మార్గాల్లోకి మళ్లుతాయి అనేది తెలుసుకునేందుకు ప్రస్తుతం సర్వే జరుగుతోంది.
- గరిష్ఠంగా ఎన్ని యాక్సిల్స్ వాహనాలు(Amaravati ORR).. అత్యధికంగా ఎంత లోడుతో.. అమరావతి ఓఆర్ఆర్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది అనే దానిపై సర్వే చేస్తున్నారు.
- వాస్తవానికి 189 కి.మీ మేర విస్తరించిన అమరావతి ఓఆర్ఆర్ ఎలైన్‌మెంట్‌ను 2018లో రూపొందించారు. అయితే ఆ ఎలైన్‌మెంట్‌ను ఇప్పుడు మరోసారి డ్రోన్ వీడియోలతో పరిశీలిస్తున్నారు. పాత ఎలైన్‌మెంటులోని మార్గంలో ఏవైనా కొత్త నిర్మాణాలు వచ్చాయా.. అనేది తెలుసుకుంటున్నారు. ఓఆర్‌ఆర్ మీదుగా హైటెన్షన్ విద్యుత్‌లైన్లు ఎన్ని ఉన్నాయనేది గుర్తిస్తున్నారు.
- ఈ సర్వేలు, పరిశీలనలు పూర్తయిన తర్వాత ఏపీ ప్రభుత్వంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు.. తుది ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేస్తారు. దాన్ని కేంద్రానికి పంపి ఆమోదం పొందుతారు.
- ఎలైన్‌మెంట్ ఖరారయ్యాక డీపీఆర్‌ను సిద్ధం చేస్తూనే భూసేకరణ చేస్తారు. అదే సమయంలో ఇతరత్రా అనుమతులను తీసుకోనున్నారు.
- ఓఆర్‌ఆర్‌లో భాగంగా కృష్ణానదిపై 2 భారీ వంతెనలు, రైల్వేక్రాసింగ్స్ వద్ద వంతెనలు, 2 సొరంగాలు, కాల్వలు, తదితర వివరాలన్నీ డీపీఆర్‌లో పొందుపర్చనున్నారు.
- ఓఆర్‌ఆర్ కోసం 5 జిల్లాల పరిధిలో దాదాపు 3వేల హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. ఏడాదిలో 90శాతం భూసేకరణ పూర్తయితే టెండర్లు పిలిచి పనులు మొదలుపెడతారు.
- ఓఆర్‌ఆర్‌లో కొంతభాగం అటవీ ప్రాంతాల మీదుగా వెళ్తుండటంతో అటవీశాఖ అనుమతులు, పర్యావరణ అనుమతులు పొందాల్సి ఉంది.