బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?
మరోవైపు బ్రిటన్ ఆన్‌లైన్ భద్రతా చట్టాన్ని ఎలోన్ మస్క్ విమర్శించారు. ఈ చట్టం ప్రజల గొంతు నొక్కడానికేనని ఆయన వాదిస్తున్నారు.
- Author : Gopichand
Date : 09-01-2026 - 12:11 IST
Published By : Hashtagu Telugu Desk
Britain: బ్రిటన్‌లో ‘X’ ప్లాట్‌ఫామ్‌కు చెందిన AI చాట్‌బాట్ ‘గ్రోక్’ సృష్టించిన వివాదం కారణంగా ఆ యాప్‌పై నిషేధం విధించే అవకాశం కనిపిస్తోంది. మహిళలు, పిల్లలను అసభ్యకరంగా చూపుతూ ఈ చాట్‌బాట్ చిత్రాలను రూపొందిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 65 కోట్ల మంది వినియోగదారులు ఉన్న ‘X’కు కేవలం బ్రిటన్‌లోనే 2 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.
ప్రధాని సీరియస్
గ్రోక్ చాట్‌బాట్‌ను ఉపయోగించి బాలల లైంగిక వేధింపులకు సంబంధించిన చిత్రాలను సృష్టిస్తున్నట్లు వార్తలు రావడంతో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్రంగా స్పందించారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి, అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని మీడియా నియంత్రణ సంస్థ అయిన ‘ఆఫ్‌కామ్’ను కోరారు. ‘ది టెలిగ్రాఫ్’ నివేదిక ప్రకారం.. బ్రిటన్ ఆన్‌లైన్ భద్రతా చట్టం కింద ‘X’ సంస్థపై బిలియన్ల కొద్దీ పౌండ్ల జరిమానా విధించే లేదా బ్రిటన్‌లో ఆ యాప్‌ను పూర్తిగా నిషేధించే అధికారాలు ప్రభుత్వానికి ఉన్నాయి.
Also Read: కోటబొమ్మాళి లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ..రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఇంటర్నెట్ పర్యవేక్షణ సంస్థల సమాచారం ప్రకారం.. గ్రోక్ సాఫ్ట్‌వేర్ ద్వారా రూపొందించిన అక్రమ చిత్రాలను ‘డార్క్ వెబ్’ ఫోరమ్‌లలో షేర్ చేస్తున్నట్లు గుర్తించారు. ఇవి చట్టరీత్యా నేరమైన బాలల లైంగిక వేధింపుల కంటెంట్ కిందకు వస్తాయి. ఇది చాలా తప్పు, చట్టవిరుద్ధం. మేము దీన్ని సహించబోము. దీనిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ‘ఆఫ్‌కామ్’కు మా పూర్తి మద్దతు ఉంది అని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ అన్నారు.
ఎలోన్ మస్క్ స్పందన
మరోవైపు బ్రిటన్ ఆన్‌లైన్ భద్రతా చట్టాన్ని ఎలోన్ మస్క్ విమర్శించారు. ఈ చట్టం ప్రజల గొంతు నొక్కడానికేనని ఆయన వాదిస్తున్నారు. అయితే బాలల లైంగిక వేధింపుల చిత్రాలు లేదా రివెంజ్ పోర్నోగ్రఫీ వంటి అక్రమ కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైతే సదరు సోషల్ మీడియా సైట్‌లను నిషేధించే అధికారం ఈ చట్టం ద్వారా బ్రిటన్ అధికారులకు లభిస్తుంది.