కోటబొమ్మాళి లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ..రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- Author : Vamsi Chowdary Korata
Date : 09-01-2026 - 11:02 IST
Published By : Hashtagu Telugu Desk
Andhra Pradesh Cabinet ఆంధ్రప్రదేశ్ కేబినెట్ టెక్కలి నియోజకవర్గ విద్యార్థులకు శుభవార్త అందించింది. కోటబొమ్మాళిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. శాశ్వత భవనాలు సిద్ధమయ్యే వరకు ప్రస్తుత జూనియర్ కళాశాల భవనాన్ని తాత్కాలికంగా ఉపయోగిస్తారు. డిగ్రీ కాలేజీ ఏర్పాటుతో స్థానిక విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వానికి మంత్రి అచ్చెన్నాయుడు ధన్యవాదాలు తెలిపారు.
- ఏపీ కేబినెట్‌లో మరో కీలక నిర్ణయం
- కోటబొమ్మాళిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ
- మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.. మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. కోటబొమ్మాళిలో కొత్తగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. అయితే శాశ్వత భవనాలు సిద్ధమయ్యేలోపు, ప్రస్తుతం కోటబొమ్మాళిలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని తాత్కాలికంగా ఉపయోగించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇది విద్యార్థులు ఆలస్యం లేకుండా చదువును కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. ఈ నిర్ణయం టెక్కలి నియోజకవర్గ విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా, విద్యాపరంగా వెనుకబడిన కోటబొమ్మాళి ప్రాంతంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుంది.
కోటబొమ్మాళిలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి అవసరమైన బోధనా సిబ్బంది కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. జోన్-1 లోని ఇతర 11 డిగ్రీ కళాశాలల నుంచి 16 మిగులు (సర్‌ప్లస్) పోస్టుల నుంచి బదిలీ చేయనున్నారు. జోన్-1 నుంచి రెండు నాన్-టీచింగ్ పోస్టులను కూడా బదిలీ చేస్తారు. కాలేజీ నిర్వహణ కోసం 9 మంది నాన్-టీచింగ్ సిబ్బందిని ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించనున్నారు. ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించే 9 మంది నాన్-టీచింగ్ సిబ్బంది కాలేజీ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. ప్రిన్సిపాల్ బాధ్యతలను ఎఫ్‌ఏసీ (ఫంక్షనల్ అకౌంటబిలిటీ) పద్ధతిలో అప్పగిస్తారు. ఇప్పటికే ఉన్న కళాశాలల్లో మిగిలిపోయిన సిబ్బందిని ఇక్కడ సర్దుబాటు చేయడం వల్ల కొత్తగా నియామకాలు చేపట్టాల్సిన అవసరం తగ్గుతుంది.
ఇంతకుముందు కోటబొమ్మాళి, దాని చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులు డిగ్రీ చదువుకోవాలంటే చాలా దూరం ప్రయాణించి టెక్కలి, పలాస, శ్రీకాకుళం వెళ్లాల్సి వచ్చేది. ఈ ప్రయాణ భారం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం, విద్యార్థుల సౌకర్యార్థం డిగ్రీ కళాశాల ఏర్పాటుకు అనుమతి మంజూరు చేసింది. ఈ నిర్ణయంపై స్థానిక ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. డిగ్రీ కాలేజీకి గ్రీన్‌సిగ్నల్ రావడంతో కోటబొమ్మాళిలోని ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు పార్కులో స్థానికులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కళాశాల ఏర్పాటుతో విద్యార్థుల కష్టాలు తీరనున్నాయని, చదువులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని వారు అభిప్రాయపడ్డారు.
గతంలో కోటబొమ్మాళిలో డిగ్రీ కళాశాల మంజూరు అయిందని.. అయితే అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని వైఎస్సార్‌సీపీ నేతలు ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి, కళాశాల ఏర్పాటు అవసరం లేదని ఏకపక్షంగా రద్దు చేయించారని ఆయన ఆరోపించారు. 2024 ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చామని అచ్చెన్నాయుడు తెలిపారు. “అందరికీ విద్య.. అందరికీ బాధ్యత” అనే నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లామన్నారు. ఆయన కూడా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించి ఆమోదం తెలిపినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.