Gaza : గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా
- By Vamsi Chowdary Korata Published Date - 03:11 PM, Tue - 30 September 25

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం నాడు గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ఒక కొత్త శాంతి ప్రణాళికపై అంగీకారం కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. అయితే ఈ 20-పాయింట్ల ప్రణాళిక పూర్తి విజయం హమాస్ ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. తెల్లవారుజామున వైట్‌హౌస్‌లో జరిగిన ఒక సంయుక్త విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. మేము శాంతికి చాలా దగ్గరగా ఉన్నాము, కానీ ఇంకా పూర్తిగా ముగియలేదు. మనం ఇప్పుడు హమాస్ ఆమోదాన్ని పొందాలి” అని చెప్పారు. ఈ ప్రణాళికలో గాజాలో నివసించే పాలస్తీనియన్లు ఎవరూ తమ స్థలాలను వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ ఒప్పందానికి హమాస్ అంగీకరిస్తే మొదటి 72 గంటల్లోనే మిగిలి ఉన్న బందీలందరినీ విడుదల చేయాలి. ఇలా చేస్తే.. ఇజ్రాయెల్ సైన్యం గాజా నుంచి దశలవారీగా వెనక్కి తగ్గుతుంది. ఒప్పందం అమలులో ఉన్నప్పుడు నియమాలను పర్యవేక్షించడానికి ఒక అంతర్జాతీయ “శాంతి మండలి” ఏర్పాటు చేస్తారు. ఒకవేళ హమాస్ ఈ ప్రణాళికను తిరస్కరిస్తే.. ఇజ్రాయెల్‌కు వాషింగ్టన్ పూర్తి మద్దతు ఇస్తుంది.
నెతన్యాహు మాట్లాడుతూ.. ఈ ప్రణాళిక ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని చెప్పారు. “ఈ ప్రణాళిక మా యుద్ధ లక్ష్యాలను నెరవేరుస్తుంది. ఇది మా బందీలందరినీ ఇజ్రాయెల్‌కు తిరిగి తీసుకువస్తుంది. హమాస్ సైనిక సామర్థ్యాలను, రాజకీయ పాలనను ధ్వంసం చేస్తుంది. అలాగే గాజా మళ్లీ ఇజ్రాయెల్‌కు ఎప్పుడూ ముప్పుగా మారకుండా చేస్తుంది” అని ఆయన అన్నారు. హమాస్ ఈ ప్రణాళికను తిరస్కరించినా లేదా అంగీకరించినట్లు నటించి అడ్డుకున్నా.. ఇజ్రాయెల్ ఒంటరిగా ఈ పనిని పూర్తి చేస్తుందని నెతన్యాహు తీవ్రంగా హెచ్చరించారు. “ఈ పనిని సులభంగా లేదా కఠినంగా అయినా పూర్తి చేస్తాం” అని ఆయన అన్నారు. ఈ ప్రణాళిక భవిష్యత్తులో జరిగే రక్తపాతాన్ని నివారిస్తుందని.. గాజాకు ఒక ఆచరణాత్మకమైన మార్గాన్ని అందిస్తుందని నెతన్యాహు అభిప్రాయపడ్డారు.
ఖతర్ ప్రధాన మంత్రి, ఈజిప్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ ట్రంప్ ప్రణాళికను హమాస్ సంధానకర్తలకు సమర్పించారు. ఈ ప్రణాళికను మంచి ఉద్దేశంతో పరిశీలిస్తామని.. త్వరలో దీనిపై స్పందన ఇస్తామని హమాస్ ప్రతినిధులు మధ్యవర్తులకు తెలిపారు. ఈ ఒప్పందం ప్రకటనకు ముందు.. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఇజ్రాయెల్ దాడిలో ఒక ఖతర్ సైనికుడు మరణించడంపై నెతన్యాహు అధికారికంగా ఖతర్‌కు క్షమాపణలు చెప్పారు. ఇజ్రాయెల్ హమాస్ లక్ష్యంగానే ఆ దాడి చేసింది. కానీ అనుకోకుండా ఖతర్ సైనికుడు చనిపోయారని వైట్‌హౌస్ తెలిపింది.