పాకిస్థాన్‌లో మేధో వలసలు.. దేశాన్ని వీడుతున్న డాక్టర్లు, ఇంజనీర్లు!
నివేదిక ప్రకారం విదేశీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024లో 7,27,381 మంది పాకిస్థానీలు విదేశీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
- Author : Gopichand
Date : 27-12-2025 - 4:08 IST
Published By : Hashtagu Telugu Desk
Pakistan: ప్రస్తుతం పాకిస్థాన్ తన చరిత్రలోనే అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, రాజకీయ అస్థిరత కారణంగా నిపుణులైన వారు దేశంలో ఉండటానికి ఇష్టపడటం లేదు. గత రెండేళ్లలో వేల సంఖ్యలో డాక్టర్లు, ఇంజనీర్లు దేశం విడిచి వెళ్లిపోయినట్లు ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
షాకింగ్ గణాంకాలు
పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ ఎమిగ్రేషన్ అండ్ ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ నివేదిక ప్రకారం.. గత రెండేళ్లలో వలస వెళ్ళిన నిపుణుల వివరాలు ఇలా ఉన్నాయి.
- డాక్టర్లు: 5,000 మందికి పైగా
- అకౌంటెంట్లు: 13,000 మంది
- ఇంజనీర్లు: 11,000 మంది
ఈ పరిస్థితిపై పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వలసలను ఆయన ‘బ్రెయిన్ డ్రెయిన్’ (మేధో వలస) కాదని, ‘బ్రెయిన్ గెయిన్’ అని అభివర్ణించడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత.!
షెహబాజ్ ప్రభుత్వంపై విమర్శలు
మాజీ పాకిస్థానీ సెనేటర్ ముస్తఫా నవాజ్ షేకర్ ఈ గణాంకాలను షేర్ చేస్తూ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజకీయాలు బాగుపడితేనే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఫ్రీలాన్సింగ్ హబ్. కానీ ఇంటర్నెట్ నిలిపివేత కారణంగా దేశం 1.62 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. సుమారు 23.7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.
రెండేళ్లలో వలసల జోరు
నివేదిక ప్రకారం విదేశీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024లో 7,27,381 మంది పాకిస్థానీలు విదేశీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 2025 నాటికి 6,87,246 మంది రిజిస్టర్ చేసుకున్నారు. కేవలం డాక్టర్లు, ఇంజనీర్లే కాకుండా 2011 నుండి 2024 మధ్య కాలంలో నర్సుల వలసలు కూడా భారీగా పెరిగాయి. 2025లో కూడా ఇదే ధోరణి కొనసాగుతుండటం పాకిస్థాన్ భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తోంది.