Blasts In Pakistan: పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. పోలీసు మృతి, ఎనిమిది మందికి గాయాలు
పాకిస్తాన్ వార్తా ఛానెల్ జియో నివేదిక ప్రకారం.. ఈ దాడిలో పేలుడు (Blasts In Pakistan) కారణంగా ఒక పోలీసు వీరమరణం పొందాడు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
- By Gopichand Published Date - 06:24 AM, Fri - 21 July 23

Blasts In Pakistan: పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఖైబర్ జిల్లాలోని బారా బజార్ ప్రాంతంలో ఆత్మాహుతి దాడి జరిగినట్లు పాకిస్థాన్ పోలీసులు గురువారం (జూలై 20) తెలియజేశారు. పాకిస్తాన్ వార్తా ఛానెల్ జియో నివేదిక ప్రకారం.. ఈ దాడిలో పేలుడు (Blasts In Pakistan) కారణంగా ఒక పోలీసు వీరమరణం పొందాడు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఖైబర్ పఖ్తుంఖ్వా పోలీసులు తహసీల్ ప్రాంగణంలోకి ప్రవేశించే వ్యక్తులను తనిఖీ చేస్తున్నప్పుడు పోలీసులపై ఈ దాడి జరిగింది. పోలీస్ తహసీల్ కాంప్లెక్స్‌లో బారా పోలీస్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాలు, యాంటీ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ సెల్ ఉన్నాయి.
ఈ దాడి తర్వాత గాయపడిన వారిని జిల్లా ప్రధాన ఆసుపత్రి డోగ్రా ఖైబర్ ఏజెన్సీలో చేర్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పేలుడుకు గల కారణాలేమిటో తెలియరాలేదు. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి పొగలు రావడాన్ని గమనించిన పోలీసులు ప్రాథమికంగా సమాచారం అందించారు. అంతే కాకుండా పేలుడు తర్వాత భారీగా కాల్పులు జరిగాయి. పెషావర్‌లోని రేగి ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మరణించగా, మరో ఇద్దరు గాయపడటంతో ఖైబర్ పఖ్తుంఖ్వా పోలీసులపై గత రాత్రి మరో దాడి జరిగింది.
రెజీ మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కాల్పులు
జూలై 19న రేగి మోడల్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద గుర్తుతెలియని సాయుధ వ్యక్తులు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయారని పోలీసులు తెలిపారు. గాయపడిన పోలీసులను చికిత్స నిమిత్తం ఖైబర్ టీచింగ్ ఆసుపత్రికి తరలించారు. బుధవారం జరిగిన దాడిలో మరణించిన జవాన్లను హెడ్ కానిస్టేబుల్ వాజిద్, డ్రైవర్ ఫర్మాన్‌గా గుర్తించారు.ఈ రోజుల్లో పాకిస్థాన్‌లో దాడులు చేస్తున్న వ్యక్తులు పోలీసులు, భద్రతా బలగాలను టార్గెట్ చేస్తున్నారు. దీనిని ఎదుర్కొనేందుకు పాక్ భద్రతా బలగాలు కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.