Masood Azhar: ఢిల్లీ, ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి ఎవరంటే?
జైష్ కమాండర్ మాట్లాడుతూ.. మే 7న భారత వైమానిక దళం జైష్‌కు చెందిన బహావల్పూర్ ప్రధాన కార్యాలయం జామియా మసీద్ సుభాన్ అల్లాపై వైమానిక దాడి చేసిందని, ఇందులో మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు చాలా మంది చనిపోయారని తెలిపారు.
- By Gopichand Published Date - 04:55 PM, Wed - 17 September 25

Masood Azhar: పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్‌కు చెందిన అగ్ర నాయకుడు మసూద్ ఇలియాస్ కశ్మీరీ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న పాకిస్తాన్ గురించి సంచలన విషయాలను వెల్లడించారు. ఢిల్లీ, ముంబైలలో జరిగిన ఉగ్రవాద దాడులకు సూత్రధారి మసూద్ అజహరేనని (Masood Azhar) ఆయన అంగీకరించారు. ఒక వీడియోలో పార్లమెంట్ దాడి, 26/11 ముంబై దాడుల వెనుక ఉన్నది జైష్-ఎ-మొహమ్మద్ అధినేత మసూద్ అజహరేనని అతను ఒప్పుకున్నాడు.
జైష్ కమాండర్ అంగీకారంతో పాకిస్తాన్ రహస్యాలు బయటపడ్డాయి
ఇలియాస్ కశ్మీరీ మసూద్ అజహర్ ఉగ్రవాద కార్యకలాపాలను ధృవీకరించడమే కాకుండా బాలాకోట్, బహావల్పూర్‌లో జైష్-ఎ-మొహమ్మద్ స్థావరాలు ఉన్నాయని కూడా వెల్లడించారు. పాకిస్తాన్ తన భూమిపై ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడాన్ని పదేపదే నిరాకరిస్తున్నప్పటికీ ఇలియాస్ అంగీకారం ప్రపంచం ముందు దాని నిజస్వరూపాన్ని బట్టబయలు చేసింది. అజహర్ స్థావరం బాలాకోట్‌లో ఉందని, దీనిని 2019లో భారత్ వైమానిక దాడులతో లక్ష్యంగా చేసుకుందని అతను తెలిపారు.
Also Read: Varun Chakravarthy: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన టీమిండియా స్పిన్నర్!
మసూద్ అజహర్ ఢిల్లీ- ముంబైని వణికించాడు
జైష్ కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ వీడియోలో మాట్లాడుతూ.. ఢిల్లీలోని తీహార్ జైలు నుండి మౌలానా మసూద్ అజహర్ పాకిస్తాన్‌కు వచ్చారు. అతని మిషన్‌ను పూర్తి చేయడానికి బాలాకోట్ గడ్డ అతనికి ఆశ్రయం ఇచ్చింది. ఈ గడ్డకు మేము ఎంతో రుణపడి ఉంటాం. ఈ గడ్డ పాత్రను ప్రళయం వరకు గుర్తుంచుకుంటారు. ఢిల్లీ, ముంబైని వణికించిన మౌలానా మసూద్ అజహర్ ఈ గడ్డపై కనిపిస్తారని పేర్కొన్నారు.
ఆపరేషన్ సింధూర్‌లో మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు చనిపోయారు
జైష్ కమాండర్ మాట్లాడుతూ.. మే 7న భారత వైమానిక దళం జైష్‌కు చెందిన బహావల్పూర్ ప్రధాన కార్యాలయం జామియా మసీద్ సుభాన్ అల్లాపై వైమానిక దాడి చేసిందని, ఇందులో మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు చాలా మంది చనిపోయారని తెలిపారు. బహావల్పూర్‌లో చనిపోయిన జైష్ ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరు కావాలని పాకిస్తాన్ సైన్యంలోని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయబడ్డాయని అతను వెల్లడించారు. పాకిస్తాన్‌కు చెందిన పలువురు సైనికాధికారులు ఉగ్రవాదుల అంత్యక్రియలలో పాల్గొనడం అప్పట్లో కనిపించింది. ఆ సమయంలో ఉగ్రవాదులకు గౌరవం ఇవ్వడంపై భారత్ పాకిస్తాన్‌ను తీవ్రంగా మందలించింది.