Elon Musk: మరోసారి ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్
బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. $187 బిలియన్ల నికర విలువతో మస్క్ బిలియనీర్ల జాబితాలో మరోసారి మొదటి స్థానాన్ని పొందాడు.
- By Gopichand Published Date - 06:56 AM, Wed - 1 March 23

బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. $187 బిలియన్ల నికర విలువతో మస్క్ బిలియనీర్ల జాబితాలో మరోసారి మొదటి స్థానాన్ని పొందాడు. గత ఏడాది సంపన్నుల జాబితాలో మొదటి స్థానానికి చేరుకున్న ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ లూయిస్ ఫైనాన్స్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను మస్క్ వెనక్కి నెట్టాడు.
తాజా సమాచారం ప్రకారం ఎలాన్ మస్క్ నికర విలువ 187.1 బిలియన్ డాలర్లు. అదే సమయంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఆస్తులు $ 185.3 బిలియన్లుగా అంచనా వేయబడ్డాయి. గత ఏడాది సంపన్నుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయిన మస్క్ 2023లో తన సంపదలో విపరీతమైన పెరుగుదల కనిపించింది. అతని ఆటో కంపెనీ టెస్లా షేర్లు పెరగడమే దీనికి ప్రధాన కారణం. ఈ ఏడాది టెస్లా స్టాక్ 90 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీని కారణంగా మస్క్ 2023లోనే తన సంపదకు 36 శాతం అంటే 50 బిలియన్ డాలర్లు జోడించాడు. 2022 డిసెంబర్ చివరి నాటికి మస్క్ ఆస్తులు $137 బిలియన్లకు చేరుకున్నాయి. ఈ సమయంలో అతను తన సంపదలో $ 200 బిలియన్లను కోల్పోయిన మొదటి వ్యక్తి అయ్యాడు.
2022 అక్టోబర్‌లో ట్విట్టర్‌ని $44 బిలియన్లు కొనుగోలు చేసిన ఒక వారం తర్వాత కంపెనీ ఆదాయం బాగా పడిపోయింది. దీని తర్వాత మస్క్ కంపెనీలో సగం కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తగ్గించి, మైక్రోబ్లాగింగ్ సైట్‌లో బ్లూ సబ్‌స్క్రిప్షన్ సేవను ప్రారంభించాడని ఓ నివేదిక పేర్కొంది. ఇది మాత్రమే కాదు సంస్థ శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయం నుండి జ్ఞాపికలను కూడా వేలం వేయటం జరిగింది.
ట్విట్టర్ కు కొత్త సీఈవో
ఈ ఏడాదిలో కొత్త వ్యక్తికి ట్విట్టర్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో మస్క్‌కు చెందిన మరో సంస్థ బోరింగ్ కంపెనీకి సీఈవో అయిన స్టీవ్ డేవిస్‌ను ట్విట్టర్ సీఈవోగా నియమిస్తున్నట్లు సమాచారం. గతేడాది ట్విట్టర్‌లో ఖర్చులు తగ్గించే బాధ్యతలను డేవిస్ సమర్థవంతంగా నేరవేర్చారని, అందుకే మస్క్ ఆయనకు ట్విట్టర్ పగ్గాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆధికారిక ప్రకటన రావాల్సి ఉంది.