Alai Balai : తెలంగాణ సాధనలో ‘అలయ్ బలయ్’ పాత్ర కీలకం : సీఎం రేవంత్
దసరా అంటేనే పాలపిట్ట, జమ్మిచెట్టు(Alai Balai) గుర్తుకు వస్తాయి.
- By Pasha Published Date - 03:43 PM, Sun - 13 October 24

Alai Balai :నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరిగిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బండారు విజయలక్ష్మి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ ప్రసంగిస్తూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ ఆవిర్భావానికి అలయ్ బలయ్ దోహదపడిందన్నారు. అప్పట్లో అన్ని సామాజిక వర్గాలను తెలంగాణ ఉద్యమం దిశగా కార్యోన్ముఖులను చేసేందుకు అలయ్ బలయ్ దోహదపడిందని ముఖ్యమంత్రి కొనియాడారు. దత్తాత్రేయ వారసత్వాన్ని ఆయన కుమార్తె విజయలక్ష్మి ముందుకు తీసుకెళ్తుండటం చాలా మంచి విషయమన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్రానికి దసరా అతిపెద్ద పండుగ. దసరా అంటేనే పాలపిట్ట, జమ్మిచెట్టు(Alai Balai) గుర్తుకు వస్తాయి. అలయ్ బలయ్ అంటే బండారు దత్తాత్రేయ గుర్తుకు వస్తారు’’’ అని రేవంత్ పేర్కొన్నారు.
Also Read :CIA Plot : వెనెజులా అధ్యక్షుడు మాడురో హత్యకు సీఐఏ కుట్ర భగ్నం ?
ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా వీహెచ్, కేశవరావు, పొన్నం ప్రభాకర్ అలయ్ బలయ్‌లో పాల్గొన్నారని సీఎం రేవంత్ చెప్పారు. ఇది రాజకీయాలతో సంబంధం లేదని కార్యక్రమమని స్పష్టం చేశారు. ‘‘అంతరించిపోతున్న తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు దత్తాత్రేయ ఎనలేని ప్రయత్నం చేస్తున్నారు. మన సంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఆర్‌ఎస్‌యూ దాకా.. కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ దాకా ప్రతీ సంస్థ తెలంగాణ సాధన కోసం అలుపెరగకుండా ఉద్యమించాయి’’ అని రేవంత్ తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరో పది మందిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గొంగళితో సన్మానించారు.ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, బీజేపీ నేత లక్ష్మణ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మేఘాలయ గవర్నర్లు పాల్గొన్నారు.