Police Warning: సంధ్య థియేటర్ ఘటన.. మరోసారి వార్నింగ్ ఇచ్చిన పోలీసులు!
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.
- By Gopichand Published Date - 01:00 PM, Wed - 25 December 24

Police Warning: తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా ఉన్న విషయం సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన. తాజాగా సంధ్య థియేటర్ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారికి హైదరాబాద్ సిటీ పోలీసులు వార్నింగ్ (Police Warning) ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప-2 హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్‌ను మంగళవారం చిక్కడపల్లి పోలీసులు దాదాపు 4 గంటలపాటు విచారించిన విషయం తెలిసిందే.
ఇకపోతే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం మా దృష్టికి వచ్చింది. ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. అయినా కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటనలో తెలిపారు.
Also Read: Rohit Sharma To Open: టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో భారీ మార్పు.. ఓపెనర్‌గా రోహిత్ శర్మ?
అంతేకాకుండా, ఈ విషయంలో పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్ గా పరిగణిస్తాం. ఒక అమాయకురాలు మరణం, ఒక పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసు శాఖ ఎంతో నిబద్ధతతో విచారణ జరుపుతోంది. దానిని ప్రశ్నించేలా అసత్య ప్రచారాలు, అభూతకల్పనలతో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రచారం చేస్తే సహించేది లేదు. ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే పోలీసు శాఖకు అందించవచ్చు. కానీ సొంత వ్యాఖ్యానాలు చేయవద్దని పోలీసు శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని ఆ ప్రకటనలో వెల్లడించారు.