Gurukul Hostel Food : గురుకుల పాఠశాల విద్యార్థులుకు విషంగా మారిన రేవంత్ – హరీశ్ రావు
Gurukul Hostel Food : తెలంగాణ రాష్ట్రంలోనూ గురుకుల పాఠశాలల్లో నిత్యం విద్యార్థులు హాస్పటల్ పాలవుతున్నారు. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురి అవుతున్నారు
- Author : Sudheer
Date : 13-12-2025 - 12:08 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్రంలోనూ గురుకుల పాఠశాలల్లో నిత్యం విద్యార్థులు హాస్పటల్ పాలవుతున్నారు. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురి అవుతున్నారు. తల్లిదండ్రులు , ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజుకో గురుకుల పాఠశాల విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్న దయనీయ పరిస్థితిని ఆయన ఎత్తి చూపారు.
తాజాగా అస్వస్థతతో కింగ్ కోఠి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాగ్ లింగంపల్లి గురుకుల విద్యార్థులను పరామర్శించిన ఆయన, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పిల్లల ప్రాణాల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. గురుకులాల నిర్వహణలో నెలకొన్న లోపాలను, ఆహార నాణ్యత పర్యవేక్షణ కొరవడటాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
ICC- JioStar: ఐసీసీ- జియోస్టార్ డీల్ పై బ్రేక్.. పుకార్లను ఖండించిన ఇరు సంస్థలు!
‘రూ. 100 కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆడటమెందుకు రేవంత్? ఆ డబ్బుతో విద్యార్థులకు మంచి అన్నం పెట్టలేవా?’ అని ప్రశ్నించారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అనవసరమైన ఆర్భాటాల కోసం ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, కడుపు నిండా నాణ్యమైన భోజనం లేక ఆస్పత్రుల పాలవుతున్న విద్యార్థుల సమస్యను పరిష్కరించడంలో ఎందుకు శ్రద్ధ చూపడం లేదని నిలదీశారు. ఫుట్బాల్ క్రీడలను ప్రోత్సహించడం తప్పు కానప్పటికీ, అత్యంత ప్రాథమికమైన విద్యార్థుల భోజనం నాణ్యతను విస్మరించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు ఎటువైపు ఉన్నాయో ఈ సంఘటనలు తేటతెల్లం చేస్తున్నాయని హరీష్ రావు అన్నారు.
అంతేకాకుండా రేవంత్ రెడ్డి ప్రకటించిన ‘విజన్ 2047’ లక్ష్యంపై కూడా హరీష్ తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘విజన్ 2047 అని డబ్బా కొట్టుకుంటున్నావు. పిల్లల పాలిట మాత్రం పాయిజన్గా మారావు’ అంటూ ముఖ్యమంత్రి పాలన తీరును దుయ్యబట్టారు. భవిష్యత్తు గురించి గొప్పగా మాట్లాడే నాయకుడు, వర్తమానంలో పిల్లలకు కనీస ఆరోగ్య భద్రత కల్పించలేకపోవడం ఏంటని ఆయన నిలదీశారు. విద్యార్థులకు అందిస్తున్న కలుషిత ఆహారం వారి ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తుందని, తక్షణమే ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించి, మెనూతో పాటు ఆహారం నాణ్యత, వంటశాలల పరిశుభ్రతపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, బీఆర్‌ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హరీష్ రావు హెచ్చరించారు.