ICC- JioStar: ఐసీసీ- జియోస్టార్ డీల్ పై బ్రేక్.. పుకార్లను ఖండించిన ఇరు సంస్థలు!
తమ ప్రకటనలో అన్ని ఈవెంట్‌ల సన్నాహాలు పూర్తిగా ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని, దీని వలన ఏ ప్రేక్షకుడికి, ప్రకటనదారుకు లేదా పరిశ్రమ భాగస్వామికి ఏమాత్రం ప్రభావం పడటం లేదని ఇద్దరూ స్పష్టం చేశారు.
- Author : Gopichand
Date : 13-12-2025 - 10:26 IST
Published By : Hashtagu Telugu Desk
ICC- JioStar: భారతదేశం- శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి ఇంకా 2 నెలల కంటే తక్కువ సమయం ఉంది. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, జియోస్టార్ (ICC- JioStar) మధ్య డీల్ రద్దయింది అనే వార్తలు వచ్చాయి. ఇది క్రికెట్ ప్రపంచంలో కలకలం సృష్టించింది. అయితే ఇప్పుడు ICC క్రికెట్ అభిమానులకు ఊరట కలిగించే వార్తను అందించింది.
ఐసీసీ, జియోస్టార్ తామే డీల్ రద్దుపై వచ్చిన పుకార్లను ఖండించాయి. ICC, జియోస్టార్ శుక్రవారం (డిసెంబర్ 12) ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేస్తూ తమ 3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.27 వేల కోట్లు) డీల్ పూర్తిగా పటిష్టంగా ఉందని, 2027 వరకు అలాగే కొనసాగుతుందని స్పష్టం చేశాయి.
ICC పుకార్లకు ముగింపు పలికింది
ఇటీవల ఎకనామిక్ టైమ్స్ నివేదికలో జియోస్టార్ ICCతో కుదుర్చుకున్న బ్రాడ్‌కాస్టింగ్ డీల్‌ను మధ్యలోనే రద్దు చేయాలని నిర్ణయించుకుందని పేర్కొంది. నివేదిక ప్రకారం.. ఈ డీల్ అధిక ధర సంస్థకు భారంగా మారిందని, దాని కారణంగా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపింది. వాస్తవానికి జియోస్టార్ 2024 నుండి 2027 వరకు భారతదేశంలో ICC ఈవెంట్‌ల ప్రసార హక్కులను సుమారు రూ. 27 వేల కోట్లకు దక్కించుకుంది.
Also Read: Benz Cars Price Hike : భారీగా పెరగనున్న బెంజ్ కార్ల ధరలు
ఈ కారణంగానే కంపెనీ డీల్‌ను గడువుకు ముందే రద్దు చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ICC-జియోస్టార్ ఈ వార్తలను పూర్తిగా తోసిపుచ్చింది. డీల్ రద్దైందని, లేదా జియోస్టార్ వెనక్కి తగ్గుతోందని మీడియాలో వస్తున్న కథనాలన్నీ అవాస్తవమని పేర్కొన్నారు. జియోస్టార్ ఇప్పటికీ భారతదేశంలో ICC అధికారిక మీడియా హక్కుల భాగస్వామిగా కొనసాగుతోంది.
ICC-జియోస్టార్ ప్రకటన విడుదల
ICC, జియోస్టార్ డిసెంబర్ 12న ఈ ఊహాగానాలన్నింటినీ కొట్టిపారేస్తూ ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. ఈ ప్రకటనలో ICC, జియోస్టార్ మాట్లాడుతూ.. జియోస్టార్ తమ కాంట్రాక్ట్ అన్ని నిబంధనలను నెరవేర్చడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. రాబోయే ICC టోర్నమెంట్‌లను ముఖ్యంగా టీ20 ప్రపంచ కప్‌ను భారతీయ అభిమానులకు నిరాటంకంగా, అద్భుతమైన కవరేజ్‌తో అందించడంపై ఇద్దరూ కలిసి దృష్టి సారిస్తున్నారని పేర్కొంది.
తమ ప్రకటనలో అన్ని ఈవెంట్‌ల సన్నాహాలు పూర్తిగా ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని, దీని వలన ఏ ప్రేక్షకుడికి, ప్రకటనదారుకు లేదా పరిశ్రమ భాగస్వామికి ఏమాత్రం ప్రభావం పడటం లేదని ఇద్దరూ స్పష్టం చేశారు. ICC, జియోస్టార్ చాలా కాలంగా భాగస్వాములుగా ఉన్నారని, ఈ భాగస్వామ్యం ద్వారా క్రికెట్‌ను మరింత ముందుకు ఎలా తీసుకువెళ్లాలనే దానిపై నిరంతరం ఆలోచిస్తున్నామని తెలిపారు.