Lagcherla Incident: లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించం.. మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించబోమని, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.
- By Gopichand Published Date - 07:52 PM, Thu - 14 November 24

Lagcherla Incident: రాష్ట్ర ప్రభుత్వాన్ని, పరిపాలనను అస్ధిరత పరచాలన్న కుట్ర జరుగుతోందని, అధికారం కోల్పోయామన్న అక్కసుతో అమాయకులైన రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. చిల్లర, అవకాశవాద, కుట్రపూరిత రాజకీయాలతో మనుగడ సాగించలేరనే విషయాన్ని బీఆర్ఎస్ గుర్తించాలని హితవు పలికారు. పార్టీ ఉనికి కోసం (Lagcherla Incident) అమాయక రైతులను బలిపెట్టవద్దని ఆ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు.
లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించబోమని, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. లగచర్లలో ప్రజలు, అక్కడి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి జిల్లా కలెక్టర్‌తో సహా అధికారులు వెళ్లినప్పుడు ఎలాంటి చర్చకు ఆస్కారం ఇవ్వకుండానే దాడికి పాల్పడడం నీచం, అత్యంత హేయమైన చర్య అన్నారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారంటే దాని వెనుక భారీ కుట్ర కోణం దాగి ఉందని అర్ధమవుతుందన్నారు.
Also Read: Air pollution : ఢిల్లీ భారీగా వాయు కాలుష్యం..రేపటి నుండి నూతన నిబంధనలు..!
రైతులు తమ సమస్యలను చెప్పుకోవడానికి, స్ధానికుల సమస్యలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఈలాంటి కుట్రపూరితచర్యలకు పాల్పడడం దురదృష్టకరం. రైతులను నష్టపెట్టాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం కాదు, వారి సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ప్రజాస్వామ్య యుతంగా వెళ్తుందని పేర్కొన్నారు.
ఆనాటి ప్రభుత్వం పెట్టిన హింసను భరించలేక 2021 జూన్ నెలలో వేములఘాట్ గ్రామ రైతు తూటుకూరి మల్లారెడ్డి కూల్చివేసిన తన ఇంటిలోని కట్టెలను పోగుచేసి దానినే చితిగా మార్చుకొని తనకు తాను ఆ చితిమంటల్లో ఆత్మార్పణ చేసుకున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. మల్లన్న సాగర్ విషయంలో రైతులకు సంబంధించి ఇలాంటి యధార్ధ కథనాలు కోకోల్లలు ఉన్నాయన్నారు. ‘అధికారం పోయిన ఏడాదిలోనే ఇంత అసహనం, అసాంఘిక శక్తులుగా మారిన బీఆర్ఎస్ నిజస్వరూపం ప్రజలకు అర్దమవుతోందని అన్నారు.