KTR Vs ED : వచ్చే వారం కీలకం.. కేటీఆర్ విషయంలో ఈడీ, ఏసీబీ ఏం చేయబోతున్నాయి ?
కార్ల రేసు వ్యవహారంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో జరిగిన లావాదేవీలను ఈడీ(KTR Vs ED) నిశితంగా పరిశీలిస్తోంది.
- By Pasha Published Date - 09:09 AM, Sun - 22 December 24

KTR Vs ED : ‘ఫార్ములా–ఈ’ కార్ల రేసు వ్యవహారంలో రేపటి (సోమవారం) నుంచి కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఈ కేసులో ఏ 1గా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏ 2గా పురపాలకశాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, ఏ 3గా హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి ఉన్నారు. తెలంగాణ ఏసీబీ ఫైల్ చేసిన కేసు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)ను ఈడీ అధికారులు ఇప్పటికే నమోదు చేశారు. ఏ1, ఏ2, ఏ3గా ఉన్న నిందితులకు రేపు (సోమవారం) ఈడీ సమన్లు జారీ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది.
Also Read :Train Dragged Wires : విశాఖ రైల్వేస్టేషన్‌లో షాకింగ్ ఘటన.. విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లిన ఇంజిన్
కార్ల రేసు వ్యవహారంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో జరిగిన లావాదేవీలను ఈడీ(KTR Vs ED) నిశితంగా పరిశీలిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)కి చెందిన జనరల్ ఫండ్స్ నుంచి బ్రిటన్‌కు చెందిన ‘ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈఓ)’కు రూ.45.71 కోట్లను విదేశీ కరెన్సీలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ లావాదేవీలను అప్పట్లో ధ్రువీకరించిన ఆ బ్యాంకు అధికారుల వాంగ్మూలాలను ఈడీ అధికారులు రికార్డు చేస్తారు. విదేశీ సంస్థకు నిధులను చెల్లించే క్రమంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి తీసుకోకపోవడం ఫెమా ఉల్లంఘన అవుతుందని ఈడీ అధికార వర్గాలు చెబుతున్నాయి. మనీలాండరింగ్ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.
Also Read :Allu Arjun Jail Again: అల్లు అర్జున్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమా? పోలీసులు ఏం చేయబోతున్నారు!
మరోవైపు ఇదే కేసుపై ఏసీబీ కూడా దర్యాప్తును కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఏసీబీ సేకరించే డాక్యుమెంట్స్ అన్నీ ఈడీకి ఉపయోగపడుతున్నాయి. ఇదే క్రమంలో వచ్చే వారంలో ఈడీ సేకరించనున్న ఆధారాలు కూడా ఏసీబీకి ఉపయోగపడనున్నాయి. ఈ కేసులో డిసెంబరు 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని, అయితే దర్యాప్తును కంటిన్యూ చేయొచ్చని తెలంగాణ ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. అప్పట్లోగా ఈడీ సేకరించే డాక్యుమెంట్స్‌ను వాడుకొని.. దర్యాప్తులో ఏసీబీ కూడా కీలక పురోగతిని సాధించే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. హెచ్‌ఎండీఏ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎం. దానకిశోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ నమోదు చేయనుందని తెలుస్తోంది.