Minister Ponguleti: ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి అమలుకు కలెక్టర్లే మార్గదర్శకులు: మంత్రి పొంగులేటి
తెలంగాణ ప్రజానీకం అత్యంత నమ్మకం, విశ్వాసంతో మాకు అధికారం అప్పగించారు. వారి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనల మేరకు రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా భూభారతి చట్టానికి, అలాగే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టామన్నారు.
- By Gopichand Published Date - 04:56 PM, Wed - 2 July 25

Minister Ponguleti: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం దార్శనికతతో తీసుకువచ్చిన భూభారతి చట్టం అమలు, పేదల కలలను సాకారం చేసే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసి వాటి ఫలితాలు పేదలకు అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి (Minister Ponguleti) శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ రెండు పథకాలను విజయవంతంగా అమలు చేయడానికి జిల్లా కలెక్టర్లు నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు.
బుధవారం నాడు డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో నిర్మల్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, వనపర్తి జిల్లాల కలెక్టర్లతో భూభారతి, ఇందిరమ్మ ఇండ్లపై సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడితే స్వరాష్ట్రంలో పదేళ్లలో ఎదుర్కొన్న భూ సమస్యలకు విముక్తి లభిస్తుందని, సొంతింటి కల నెరవేరుతుందని తెలంగాణ ప్రజానీకం అత్యంత నమ్మకం, విశ్వాసంతో మాకు అధికారం అప్పగించారు. వారి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనల మేరకు రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా భూభారతి చట్టానికి, అలాగే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టామన్నారు.
Also Read: Pashamylaram Mishap: ఫ్యాక్టరీ బ్లాస్ట్.. తొలి జీతం అందుకోని కార్మికులు, కన్నీటి గాథలు ఇవే!
ఆయన ఇంకా మాట్లాడూతూ.. చట్టాన్ని రూపొందించడం ఒక ఎత్తైతే దాన్ని అమలు చేయడం మరో ఎత్తు. ఈ చట్టం ఫలితాలు ప్రతి పేదవానికి అందినప్పుడే చట్టం సార్ధకత నెరవేరుతుందన్నారు. ఈ చట్టాన్ని క్షేత్రస్ధాయిలో పటిష్టంగా అమలు చేయాల్సిన గురుతరమైన బాధ్యత మీ అందరిపై ఉంది. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. రెవెన్యూ కార్యాలయానికి వచ్చే సామాన్యుడు సైతం సంతోషపడేలా రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలి. ఇందిరమ్మ ఇండ్ల విషయానికొస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాకూడాదాని ప్రభావం ఇందిరమ్మ ఇండ్లపై పడకుండా ప్రతి సోమవారం నిధులు విడుదల చేస్తున్నాం. మీరు చేయాల్సింది లబ్దిదారుల ఎంపిక, ఇండ్ల మంజూరు, నిర్మాణ పనుల పర్యవేక్షణ. ఈ మూడు అంశాలను పకడ్బందీగా పర్యవేక్షించాలి. క్షేత్రస్ధాయిలో పర్యటించి ఇండ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన ఈ రెండు పధకాలను పకడ్బందీగా అమలు చేయాలి. అనర్హులని తేలితే ఇంటి నిర్మాణం మధ్యలో ఉన్నాకూడా రద్దు చేయడానికి వెనుకాడవద్దు. ప్రతి ఇల్లు అర్హులకే అందాలి. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుక అందేలా పర్యవేక్షించాలి అని సూచించారు.