Kishan Reddy : సడెన్‌గా ఢిల్లీకి కిషన్ రెడ్డి.. అసలు కారణం అదేనా ?
అయితే పలు ఇతరత్రా కారణాలతోనూ ఢిల్లీకి కిషన్ రెడ్డి(Kishan Reddy) వెళ్లి ఉండొచ్చు.
- By Pasha Published Date - 09:15 AM, Mon - 24 March 25

Kishan Reddy : కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. దీనిపై అంతటా ఒక్కో రకంగా చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రానికి కొత్త బీజేపీ చీఫ్ ఎంపికపై చర్చించేందుకే ఆయనకు బీజేపీ పెద్దలు కబురు పెట్టారని పలువురు అంటున్నారు. రాష్ట్ర బీజేపీలోని సీనియర్లను కాదని.. గత ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన ఈటల రాజేందర్‌కు తెలంగాణ సారథ్య బాధ్యతలను అప్పగించాలని హైకమాండ్ నిర్ణయించిందనే టాక్ వినిపిస్తోంది. అయితే సీనియారిటీ ఆధారంగా తమకు ఆ పదవిని ఇవ్వాలంటూ పలువురు తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలకు రిక్వెస్టు చేసుకున్నారట.
Also Read :Dehydration: మీరు కూడా డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారా?
రాజాసింగ్ కామెంట్స్‌తో..
తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపికపై ఇటీవలే ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎంపిక బాధ్యతను పార్టీ హైకమాండ్ తీసుకుంటే బాగుంటుందని కోరారు. సీఎంగా ఉండేవారికి తొత్తుగా వ్యవహరించే రాష్ట్ర అధ్యక్షుడు వస్తే బీజేపీకి లాభమేం ఉండదని ఆయన కామెంట్ చేశారు. ఈ అన్ని పరిణామాలపై ఎప్పటికప్పుడు తెలంగాణ నుంచి పార్టీ పెద్దలకు నివేదికలు చేరాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపిక ప్రక్రియలో ఏర్పడిన చిక్కులను విప్పే దిశగా పార్టీ పెద్దలు కసరత్తు మొదలుపెట్టారు. ఈక్రమంలోనే రాష్ట్ర బీజేపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు, నూతన అధ్యక్షుడి ఎంపికపై చర్చించేందుకే కిషన్ రెడ్డిని ఢిల్లీకి పిలిచి ఉండొచ్చని అనుకుంటున్నారు.
Also Read :Hyderabad : బాలీవుడ్ నటిపై దాడి
ఇతరత్రా కారణాలు ఇవేనా ?
అయితే పలు ఇతరత్రా కారణాలతోనూ ఢిల్లీకి కిషన్ రెడ్డి(Kishan Reddy) వెళ్లి ఉండొచ్చు. నేటి(సోమవారం) నుంచి కీలకమైన పార్లమెంటు సెషన్ జరగబోతోంది. ఇందులో వక్ఫ్ సహా పలు అంశాలకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రాధాన్యమున్న బిల్లులపై ఓటింగ్, చర్చ వంటివి ఉన్నప్పుడు తప్పకుండా కేంద్ర మంత్రులు పార్లమెంటులో అందుబాటులో ఉండాలి. ఆయా అంశాలపై చర్చించేందుకు మంత్రి మండలి సమావేశాలు సైతం జరుగుతుంటాయి. వివిధ అంశాలపై లోక్‌సభలోని విపక్ష సభ్యులు అడిగే ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. బహుశా అందుకే కిషన్ రెడ్డి ఢిల్లీకి హుటాహుటిన వెళ్లి ఉంటారని కొందరు అంటున్నారు.
ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని మరీ..
అయితే ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్‌లో జరిగే బిహార్ దివస్ కార్యక్రమంలో పాల్గొంటానని తొలుత కిషన్ రెడ్డి ప్రకటించారు. అయితే అకస్మాత్తుగా ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని, ఢిల్లీకి వెళ్లారు. ఏదో కీలకమైన అంశంపై అత్యవసర చర్చ ఉండబట్టే.. ఈవిధంగా కార్యక్రమాన్ని రద్దు చేసుకొని కిషన్ వెెళ్లి ఉంటారనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. ఆ కీలక అంశం ఏమిటి ? తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపిక విషయమా ? బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేసులో కిషన్ రెడ్డి ఉన్న విషయమా ? వక్ఫ్ బిల్లు విషయమా ? దక్షిణాది రాష్ట్రాలను కుదిపేస్తున్న నియోజకవర్గాల పునర్విభజన అంశమా ? అనేది తెలియాల్సి ఉంది.