Hyderabad : బాలీవుడ్ నటిపై దాడి
Hyderabad : ముంబయికి చెందిన ఓ బాలీవుడ్ నటి (30) ఈ నెల 18న హైదరాబాద్‌కు వచ్చింది. ఆమెను ఓ స్నేహితురాలు షాప్ ప్రారంభోత్సవానికి అతిథిగా ఆహ్వానించింది
- By Sudheer Published Date - 07:59 AM, Mon - 24 March 25

హైదరాబాద్ (Hyderabad) నగరంలో బాలీవుడ్ టీవీ నటి(Bollywood TV actress)పై దాడికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబయికి చెందిన ఓ బాలీవుడ్ నటి (30) ఈ నెల 18న హైదరాబాద్‌కు వచ్చింది. ఆమెను ఓ స్నేహితురాలు షాప్ ప్రారంభోత్సవానికి అతిథిగా ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి హాజరైనందుకు విమాన ఛార్జీలు, పారితోషికం చెల్లిస్తామని చెప్పడంతో నటి హైదరాబాద్‌కు రావడానికి అంగీకరించారు. నగరానికి చేరుకున్న ఆమె మాసబ్‌ట్యాంక్ శ్యామ్‌నగర్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బస చేశారు. అక్కడ ఓ వృద్ధ మహిళ నటికి తాత్కాలిక వసతి ఏర్పాటు చేసింది.
ఈ నెల 21న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇద్దరు మహిళలు నటిని కలిసి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశారు. ఆమె అంగీకరించకపోవడంతో వారితో వాగ్వాదం జరిగింది. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో ముగ్గురు మగవారు అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి, తమతో గడపాలని నటిపై ఒత్తిడి తెచ్చారు. ఆమె తీవ్రంగా ఎదురు తిరగడంతో దాడికి పాల్పడ్డారు. నటి గట్టిగా అరుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడంతో ముగ్గురూ అక్కడి నుంచి పారిపోయారు. అయితే వృద్ధురాలు, ఆ ఇద్దరు మహిళలు నటిని గదిలో బంధించి, ఆమె వద్ద ఉన్న రూ.50 వేల నగదుతో పరారయ్యారు.
బాధితురాలు వెంటనే డయల్ 100కు కాల్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను రక్షించారు. నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాసబ్‌ట్యాంక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మహిళా భద్రతా పరిస్థితులపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నటి పరిస్థితి ప్రస్తుతం సడే గా ఉందని, నిందితుల పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని సమాచారం.