Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా!
'కాళేశ్వరం నుంచి వచ్చిన అవినీతి డబ్బులతో హరీశ్ రావు కుట్రలు చేస్తున్నారు' అని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. 2018లో 20-25 మంది ఎమ్మెల్యేలకు ఆయన నిధులు సమకూర్చారని, అవి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చిన డబ్బులేనని ఆరోపించారు.
- By Gopichand Published Date - 12:59 PM, Wed - 3 September 25

Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కల్వకుంట్ల కవిత (Kavitha) రాజీనామా చేశారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆమె, మాజీ మంత్రి హరీశ్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీని హస్తగతం చేసుకోవడానికి హరీశ్ రావు కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే తనను పార్టీ నుంచి తప్పించారని ఆమె పేర్కొన్నారు.
హరీశ్ రావుపై కవిత సంచలన ఆరోపణలు
‘కాళేశ్వరం నుంచి వచ్చిన అవినీతి డబ్బులతో హరీశ్ రావు కుట్రలు చేస్తున్నారు’ అని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. 2018లో 20-25 మంది ఎమ్మెల్యేలకు ఆయన నిధులు సమకూర్చారని, అవి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చిన డబ్బులేనని ఆరోపించారు. ‘కొద్దిగా అటు ఇటు అయినా ఆయన దగ్గర ఎమ్మెల్యేలు ఉండాలనే కుట్రతోనే ఆ పని చేశారు. 2009లో కేటీఆర్‌ను ఓడించడానికి సిరిసిల్లకు రూ. 60 లక్షలు పంపారు’ అని ఆమె ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, తనను ఓడించేందుకు కుట్రలు చేశారని కవిత పేర్కొన్నారు.
రేవంత్ కాళ్లు పట్టుకుని హరీశ్ రావు సరెండర్ అయ్యారు: కవిత
ముఖ్యమంత్రి రేవంత్‌తో కలిసి హరీశ్ రావు ఢిల్లీ నుంచి ఒకే విమానంలో ప్రయాణించారని కవిత ఆరోపించారు. ఆ తర్వాత రేవంత్ కాళ్లు పట్టుకుని హరీశ్ రావు సరెండర్ అయిన తర్వాతే తమ కుటుంబంపై కుట్రలు మొదలయ్యాయని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీని హస్తగతం చేసుకునేందుకు ఆయన కుట్రలు చేస్తున్నారు. విచారణ పేరుతో కేటీఆర్‌ను హింసించారు, మరి హరీశ్‌పై ఎందుకు కేసులు లేవు?’ అని ఆమె ప్రశ్నించారు.
Also Read: Virat Kohli: లండన్‌లో విరాట్ కోహ్లీకి ఫిట్‌నెస్ టెస్ట్!
మేం ముగ్గురం కలిసి ఉండొద్దని కుట్ర చేస్తున్నారు
‘కేసీఆర్ కుటుంబాన్ని విడగొట్టాలని కుట్రలు జరుగుతున్నాయి’ అని కవిత ఆరోపించారు. ‘హరీశ్ రావు, పార్టీలో వ్యక్తిగత లాభం కోసం చూస్తున్న కొందరు కలిసి ఈ కుట్ర చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత కలిసి ఉండొద్దనేది వారి ప్లాన్. పార్టీని తన వశం చేసుకోవాలనే కుట్రతోనే నన్ను పార్టీ నుంచి తొలగించారు. రేపు ఇదే ప్రమాదం నాన్న కేసీఆర్‌కు, రామన్నకు కూడా పొంచి ఉంది. అందుకే కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి’ అని ఆమె వ్యాఖ్యానించారు.
తనకు అన్యాయం జరుగుతుందని చెప్పినా కేటీఆర్ ఎందుకు స్పందించలేదని కవిత ప్రశ్నించారు. ‘నేను మీ చెల్లిని. పార్టీ ఆఫీసులో కూర్చొని కొందరు నా మీద కుట్రలు చేస్తున్నారని చెబితే.. ఎందుకు బాధ పడుతున్నావ్ చెల్లి అని ఫోన్ చేయవా? రక్త సంబంధం పక్కన పెట్టండి. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్, నేను ఎమ్మెల్సీని. 103 రోజులుగా ఒక్క మాట మాట్లాడరా? కేసీఆర్ బిడ్డ అయిన నాకే రెస్పాన్స్ రాకపోతే, మిగతా మహిళల పరిస్థితి ఏంటి?’ అని ఆమె నిలదీశారు.