Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!
- By Vamsi Chowdary Korata Published Date - 03:32 PM, Fri - 28 November 25
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కామారెడ్డిలోని అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద రైల్ రోకో నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేస్తున్న కవితను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసే క్రమంలో జరిగిన తోపులాటలో కవిత చేతికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఆమెను సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీ రిజర్వేషన్ల అమలును అడ్డుకుంటున్నాయని, 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు పోరాటం ఆగదని కవిత స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై నిరసన ప్రదర్శన ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో రైల్వే ట్రాక్‌పై రైల్ రోకో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, జాగృతి కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటలో కవిత చేతికి స్వల్ప గాయాలయ్యాయి.. ఆ తర్వాత ఆమెను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద కవిత, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి రైలు పట్టాలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన కారణంగా రైల్వే ట్రాక్‌పై అంతరాయం ఏర్పడటంతో.. కామారెడ్డి పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) సిబ్బంది భారీగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరసనకారులను ట్రాక్‌పై నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. మొదట పోలీసులు కవితను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆమె వెనక్కి తగ్గకపోవడంతో, బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు.
కవితతో పాటు జాగృతి నాయకులను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో పోలీసులు, జాగృతి కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, పోలీసులు బలప్రయోగం చేసి కవితను అదుపులోకి తీసుకున్నారు. ఈ పెనుగులాటలోనే కవిత చేతికి స్వల్ప గాయమైంది. వెంటనే ఆమెను అరెస్టు చేసి, సమీపంలోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీసులు అరెస్టు చేసిన అనంతరం కవిత మాట్లాడుతూ.. 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలయ్యే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆమె తీవ్రంగా ఆరోపించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కేవలం 17 శాతం రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లడం బీసీలను మోసం చేయడమేనని ఆమె విమర్శించారు. అంతేకాకుండా.. ఎంపీలు, ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేస్తే 42 శాతం బీసీ బిల్లు అమలవుతుందని ఆమె పేర్కొన్నారు.
K.Kavitha was arrested in Kamareddy leading a Rail RoKo demanding a 42% reservation for Backward Classes #JagruthiJanamBaata pic.twitter.com/99ZlOErL42
— Jagruthi Janam Baata (@J_JanamBaata) November 28, 2025