Fertility Centers: సర్కారు వారి ‘సంతాన సాఫల్య కేంద్రాలు’
ఇది నిజంగా మహిళలకు శుభవార్తే. సంతానం లేక చాలామంది ఆవేదనకు గురవుతారు.
- By Hashtag U Published Date - 11:33 AM, Wed - 11 May 22

ఇది నిజంగా మహిళలకు శుభవార్తే. సంతానం లేక చాలామంది ఆవేదనకు గురవుతారు. అలాంటివారు పిల్లల కోసం తిరగతి ఆసుపత్రి ఉండదు. మొక్కని దేవుడు ఉండడు. అయితే కొంతమంది మాత్రం పిల్లలు కలగకపోతే అది తమ దురదృష్టంగా భావిస్తారు. వైద్యపరమైన సహాయం తీసుకోవాలంటే భారీగా ఖర్చు అవుతుండడంతో వెనకడుగు వేస్తున్నారు. అలాంటివారి పరిస్థితిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం.. ఇకపై
సర్కారు ఆసుపత్రుల్లోనే సంతాన సాఫల్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానుంది. తొలిదశలో గాంధీ ఆసుపత్రితోపాటు పేట్లబుర్జు, వరంగల్ లోని ఎంజీఎంలో ఈ కేంద్రాలను ఏర్పాటుచేస్తారు. ఇక్కడ రెండు రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. ఇంట్రాయుటెరైన్ ఇన్ సెమినేషన్-ఐయూఐతోపాటు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్-ఐవీఎఫ్ సేవలను అందిస్తారు.
అదే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐవీఎఫ్ సేవలు తీసుకోవాలంటే.. గర్భదారణకు ఎలా లేదన్నా మూడు నుంచి ఐదు లక్షలు ఖర్చవుతోంది. పేదవారు పిల్లలను కనడానికి అన్నేసి లక్షలు ఖర్చుపెట్టే పరిస్థితి ఉండదు. కొంతమంది మాత్రం పిల్లలపై ఆశతో అప్పు చేసి మరీ చికిత్స తీసుకుంటున్నారు. దీంతో ఆర్థికంగా కుదేలవుతున్నారు. నిజానికి సంతాన సాఫల్యానికి వచ్చే జంటలకు ముందు కౌన్సిలింగ్ చేయాలి. తరువాత సూచనలు సలహాలు ఇవ్వాలి. కానీ పెళ్లయిన తరువాత ఒకటి రెండు సంవత్సరాల పాటు పిల్లలు పుట్టకపోతే వెంటనే ఇలాంటి కేంద్రాలకు
వెళ్లిపోతున్న జంటలు పెరిగిపోతున్నాయి.
దంపతులిద్దరిలో ఎలాంటి లోపం లేకపోతే అలాంటివారికి అసలు ఐవీఎఫ్ అవసరమే ఉండదు. కానీ కొన్ని ప్రైవేటు క్లినిక్ లు కొందరు దంపతులను మాటలతో మభ్యపెట్టి, భయపెట్టి మరీ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. అందుకే ఇలాంటి దందాను అరికట్టడానికి ప్రజలకు మేలు చేయడానికి ప్రభుత్వమే సంతాన సాఫల్య కేంద్రాల ద్వారా సేవలు అందించాలనుకుంది. గాంధీలో ఇదివరకే దీనికి సంబంధించిన పలు
పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.