Telengana : ఒవైసీకి థాంక్స్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకో తెలుసా?
ఆదివారం ఓ ప్రకటనలో ఒవైసీ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి చేసిన విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హైదరాబాదీ అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వడం సహజమేనని, వారి న్యాయ అనుభవం, ప్రజాసేవ దృష్ట్యా తన పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకుందని స్పష్టం చేశారు.
- By Latha Suma Published Date - 03:05 PM, Sun - 7 September 25

Telengana : ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆకస్మికంగా ఆసక్తికర మార్పులు చోటుచేసుకున్నాయి. ఇండియా కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించడంతో కొత్త రాజకీయ ఊహాగానాలకు తావిచ్చింది. ఆదివారం ఓ ప్రకటనలో ఒవైసీ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి చేసిన విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హైదరాబాదీ అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వడం సహజమేనని, వారి న్యాయ అనుభవం, ప్రజాసేవ దృష్ట్యా తన పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకుందని స్పష్టం చేశారు. అంతేకాదు, ఆయనతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి శుభాకాంక్షలు కూడా తెలియజేశానని ఒవైసీ వెల్లడించారు.
Read Also: BRS : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ జోరు..రాష్ట్ర పర్యటనలకు సిద్ధమవుతున్న కేటీఆర్
ఈ పరిణామంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన సీఎం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు తెలిపిన అసదుద్దీన్ ఒవైసీకి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఎంఐఎం పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామి కానప్పటికీ, ఒవైసీ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే, జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడంతో, “తెలుగు ఆత్మగౌరవం” నినాదంతో ఆయనకు మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. అయితే తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికీ తమ స్థానం ప్రకటించలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో రాష్ట్రానికి యూరియా కొరతను తీర్చే హామీ ఇచ్చినవారికే మద్దతు అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి రాజ్యసభలో బీఆర్ఎస్‌కు నలుగురు సభ్యులు ఉన్నారు.
ఇక, ఆంధ్రప్రదేశ్ రాజకీయ సన్నివేశం భిన్నంగా సాగుతోంది. ఎన్డీయే కూటమిలో భాగమైన అధికార టీడీపీ, జనసేనలు తమ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతు ప్రకటించాయి. మరోవైపు, ఏ కూటమిలోనూ లేని వైఎస్‌ఆర్‌సీపీ కూడా ఎన్డీయే అభ్యర్థికే మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో, మద్యం కేసులో అరెస్టయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఓటు హక్కు వినియోగించుకునేందుకు శనివారం మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుండగా, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల వైఖరులు విభిన్నంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో స్థిరపడిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి వస్తున్న మద్దతులతో పాటు, సీఎం రేవంత్ రెడ్డి ఈ అభ్యర్థిత్వాన్ని “తెలుగు ప్రజల గౌరవానికి” ప్రతీకగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎంఐఎం మద్దతు ఈ ప్రచారానికి బలం చేకూర్చనుంది.
Read Also: Tamil Nadu : తమిళనాడులో అమానుష ఘటన..భూవివాదంతో మహిళను చెట్టుకు కట్టేసి దాడి