Tamil Nadu : తమిళనాడులో అమానుష ఘటన..భూవివాదంతో మహిళను చెట్టుకు కట్టేసి దాడి
పాక్షికంగా ఆమెను వివస్త్రను చేసి తీవ్రంగా అవమానించారు. ఈ అమానుష చర్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
- By Latha Suma Published Date - 02:09 PM, Sun - 7 September 25

Tamil Nadu : తమిళనాడులోని కడలూరు జిల్లా పన్రుటి సమీపంలో జరిగిన ఒక దారుణ ఘటన పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభ్యసమాజం తలదించుకునేలా భూవివాదం నేపథ్యంలో నలుగురు మహిళలు కలిసి ఓ మహిళను చెట్టుకు కట్టేసి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. పాక్షికంగా ఆమెను వివస్త్రను చేసి తీవ్రంగా అవమానించారు. ఈ అమానుష చర్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Read Also: Indian Railways : దసరా, దీపావళికి స్పెషల్ ట్రైన్స్ .. 122 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి
పోలీసుల ప్రకారం, బాధిత మహిళకు, దాడి చేసిన నిందిత మహిళలకు మధ్య గత కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది. ఈ కక్ష నేపథ్యంలో నలుగురు మహిళలు బాధితురాలిని పట్టుకుని ఆమె చీరతోనే చెట్టుకు కట్టేశారు. అనంతరం ఆమె చుట్టూ నిలబడి అసభ్యంగా దూషించడంతో పాటు ఒకరు కర్రతో దాడి చేయడం, మరొకరు ఆమె జుట్టు పట్టుకుని లాగడం వంటి దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. వీడియోలో కనిపించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. ఒక మహిళ బాధితురాలిని బ్లౌజ్ నుంచి పాక్షికంగా తొలగించే ప్రయత్నం చేయడం, “నువ్వు ఓ కుక్కతో సమానం” అంటూ దూషించడం, బాధితురాలు ఏడుస్తూ తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు అందులో స్పష్టంగా కనిపించాయి.
ఘటనను వీడియో తీస్తున్న మరొక మహిళ మీరు జైలుకెళ్తారు అని హెచ్చరించినప్పటికీ నిందితులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దాడి తీవ్రత పెరిగిన వేళ, మరో మహిళ మద్ధతుగా వచ్చి నిందితులను ఆపే ప్రయత్నం చేసినట్లు వీడియోలో కనబడింది. అయినప్పటికీ దాడి కొంతసేపు కొనసాగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇప్పటికే నిందితుల్లో ఒక మహిళను అరెస్ట్ చేశారు. మిగిలిన ముగ్గురు పరారీలో ఉండగా, వారి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయని కడలూరు జిల్లా సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ప్రాథమిక విచారణ ప్రకారం, ఈ దాడికి ప్రధానంగా భూవివాదమే కారణమైందని తెలుస్తోంది. అయితే, కులం కోణంలో కూడా మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాం అని ఆయన వెల్లడించారు.
ఈ దారుణ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళపై అలా నిర్లక్ష్యంగా, పాశవికంగా వ్యవహరించడం తీవ్ర ఆవేదనకు గురిచేసింది. అనేకమంది నెటిజన్లు నిందితులపై కఠినమైన శిక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళలే మరో మహిళను అలా హింసించిన తీరు చూసి చాలా మంది ఉక్రోశిస్తున్నారు. ఈ ఘటన మరోసారి సమాజంలో మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. భూవివాదం వంటి సాధారణ తగాదాలు ఇంతటి ఘోరానికి దారితీయడం అత్యంత దురదృష్టకరం. పోలీసులు నిందితులను వెంటనే పట్టుకుని శిక్షించాల్సిన అవసరం ఉంది. అంతేకాక, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమాజమంతా చైతన్యవంతంగా స్పందించాల్సిన అవసరం ఉంది.