CM Revanth: రంగంలోకి దిగిన సీఎం రేవంత్.. విద్యార్థులతో కలిసి భోజనం!
పెంచిన చార్జీలు, మారిన మెనూ వివరాలను ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుచేసి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. 10 సంవత్సరాలుగా మెస్, 16 సంవత్సరాలుగా కాస్మోటిక్స్ చార్జీలలో పెరుగుదల లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
- By Gopichand Published Date - 10:07 AM, Sat - 14 December 24

CM Revanth: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో నేడు కొత్త మెనూ ప్రారంభం కానుంది. పోషకాహారంతో పాటు రుచికరమైన భోజనం అందించాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం డైట్ చార్జీలను ఒక్కసారిగా 40 శాతం పెంచింది. కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం పెంచింది. పెంచిన చార్జీల ప్రకారం మెనూలో మార్పులు చేపట్టారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి నేడు మధ్యాహ్నం కొత్త మెనూ ప్రకారం భోజనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు యావత్ క్యాబినెట్ నిర్ణయించింది.
ఈ సందర్భంగా మంత్రులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి భోజనం చేయనున్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వసతి గృహాల విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం డైట్, కాస్మోటిక్స్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఎనిమిది లక్షల మంది విద్యార్థులకు పోషకాహారంతో పాటు రుచికరమైన భోజనం అందుబాటులోకి రానుంది. చార్జీలు పెంచిన అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంలో భాగంగా నేడు విద్యార్థులతో యావత్ రాష్ట్ర ప్రభుత్వం కదిలి వచ్చి భోజనం చేయనుంది.
Also Read: Earthqauke: మయన్మార్‌లో మరోసారి భూకంపం.. పరుగులు తీసిన జనం!
పెంచిన చార్జీలు, మారిన మెనూ వివరాలను ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుచేసి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. 10 సంవత్సరాలుగా మెస్, 16 సంవత్సరాలుగా కాస్మోటిక్స్ చార్జీలలో పెరుగుదల లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మెస్ చార్జీలు పెంచాలంటూ గత పది ఏళ్లపాటు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఎన్ని ఆందోళనలు నిర్వహించిన ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఉన్నతాధికారులతో కమిటీ వేసి 15 రోజుల్లోనే నివేదిక తెప్పించుకొని చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పోషకాహారంతో పాటు, రుచికరమైన భోజనం అందించేందుకు మెనూ ఏ రకంగా ఉండాలనే దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులు, నిపుణులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి మెనూ ఖరారు చేశారు. పెంచిన మెస్, కాస్మోటిక్స్ చార్జీలతో రాష్ట్ర ప్రభుత్వంపై రెండు సంవత్సరాలకు రూ. 470 కోట్ల అదనపు భారం పడనుంది. అయినప్పటికీ విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుపోతోంది. సంక్షేమ విద్యార్థుల చార్జీలు పెంచడమే కాదు, వారి మెనూ ఎలా ఉండాలి అనే అంశంపై లోతుగా చర్చించడం, పలుమార్లు సమావేశాలు నిర్వహించడం, వివిధ అంశాలను పరిశీలించడం ఆ వర్గాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని స్పష్టం చేస్తుంది.