Telangana: లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ..?
- Author : Praveen Aluthuru
Date : 19-02-2024 - 4:58 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. కాంగ్రెస్ అధికార పార్టీగా బరిలోకి దిగుతుండటం, బీజేపీ ఒకవైపు నుంచి దూసుకొస్తుండటంతో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలంటే కేసీఆర్ కాషాయం పార్టీతో దోస్తీ కట్టాల్సిందేనని అంటున్నారు. మరోవైపు తెలంగాణలో కమలం పార్టీ ఆ ఊసే ఎత్తడం లేదు.
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టలేదు కానీ కేసీఆర్‌కు , ఆయన కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు పట్టం కట్టారని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల మాదిరిగానే కుటుంబ పాలనకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా విజయం సాధిస్తుందని లక్ష్మణ్ అన్నారు . మొత్తం 17 స్థానాల్లో తమ పార్టీ గట్టి పోటీని ఎదుర్కొని 10కి తగ్గకుండా గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రహస్య ఒప్పందం ప్రకారం సహకరిస్తున్నాయని అన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో విసిగిపోయామని, తమకు భవిష్యత్తు లేదనే ఉద్దేశంతోనే కూటమి పార్టీలు, నేతలు బయటకు వస్తున్నారని అన్నారు.
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. ఈ రోజు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఫిబ్రవరి 20న భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయ సంకల్ప యాత్ర ప్రారంభించనున్నారు . ఇందులో భాగంగా భువనగిరిలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఐదు చోట్ల నుంచి ఈ యాత్రలు ప్రారంభమవుతాయన్నారు. తెలంగాణ బీజేపీ నాయకత్వం అన్ని చోట్లా యాత్రల్లో పాల్గొంటుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్ర చేపట్టామన్నారు.
ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్లమెంట్ స్థానాలపై గురి పెట్టింది. మరోవైపు బీజేపీ దూకుడుగా ముందుకెళుతోంది. ఇక కారు పార్టీకి ఎంపీ నేతలు ఒక్కొక్కరు బయటకెళ్ళే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో కారు పార్టీ సరైన సంఖ్య రాబట్టకపోతే ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకమే.
Also Read: Ashwin Ramaswami : అమెరికా ఎన్నికల బరిలో 24ఏళ్ల ‘రామస్వామి’.. ఇక రికార్డులు బ్రేక్!