Formula E Car Race Case : కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు
సీజన్ 9లో రూ.110 కోట్ల లాభం వచ్చిందని వివరించారు. సీజన్ 10 కోసం ఓ సంస్థ తప్పుకుందని తెలిపారు. దీంతో ప్రభుత్వం ప్రమోటర్‌గా ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు.
- By Latha Suma Published Date - 05:11 PM, Fri - 20 December 24

Formula E Car Race Case : ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. కేటీఆర్‌పై పెట్టిన పీసీ యాక్ట్ వర్తించదని, ఆయన లబ్ధి పొందినట్లు FIRలో లేదని కేటీఆర్ తరఫు న్యాయవాది సుందరం వాదించారు. రాజకీయ కక్షలో భాగంగానే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ కార్ రేసింగ్ నిర్వహించడానికి 2022 అక్టోబర్ 25నే ఒప్పందం జరిగిందని చెప్పారు. సీజన్ 9లో రూ.110 కోట్ల లాభం వచ్చిందని వివరించారు. సీజన్ 10 కోసం ఓ సంస్థ తప్పుకుందని తెలిపారు. దీంతో ప్రభుత్వం ప్రమోటర్‌గా ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు. పాత ఒప్పందానికి కొనసాగింపుగా ఈ కొత్త ఒప్పందం జరిగిందని స్పష్టం చేశారు.
కనీసం ప్రాథమిక విచారణ చేయకుండానే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే కేసు నమోదు చేశారని అన్నారు. ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయని చెప్పారు. అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(a) సెక్షన్ దీనికి వర్తించదని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేటీఆర్ తరఫు న్యాయవాది సుందరం తెలిపారు. ప్రొసీజర్ పాటించలేదని అనడం సరైనది కాదని అన్నారు. 14 నెలల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
ఫార్ములా ఈ రేస్ కోసం నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే కేటీఆర్‌పై ఎందుకు కేసు పెట్టారని నిలదీశారు. కేటీఆర్ ఎక్కడ లబ్ధి పొందారని అడిగారు. పీసీ యాక్ట్‌లో డబ్బులు ఎవరికి వెళ్తాయో వాళ్లనే నిందితులుగా చేర్చాలని న్యాయవాది సుందరం అన్నారు. కానీ ఇక్కడ FEO సంస్థకు డబ్బులు చేరాయని.. ఆ సంస్థను మాత్రం అసలు నిందితుల జాబితాలోనే చేర్చలేదని చెప్పారు. ఇది కరప్షన్ కేసు ఎలా అవుతుందని ప్రశ్నించారు. పీసీ యాక్ట్ 13(1) ఎలా వర్తిస్తుందని అడిగారు. ఈ వ్యవహారంలో కేటీఆర్‌కు ఒక్క రూపాయి కూడా అందలేదని చెప్పారు. అయినప్పటికీ కేటీఆర్‌ను ఏ1గా చేర్చారని తెలిపారు. రాజకీయ కక్షతోనే కేసు పెట్టారు కాబట్టి.. స్టే ఇవ్వాలని కోరారు. మరోవైపు ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు.
Read Also: Jaipur : LPG ట్యాంకర్ పేలుడు..ఘటన వివరాలు..