Revanth Reddy Cabinet: కాంగ్రెస్‌లో పదవుల జాతర.. ఆ ఇద్దరికి మంత్రి పదవులు ఖాయం.. రేసులో ఉన్నది వీరే
- Author : Vamsi Chowdary Korata
Date : 15-07-2026 - 10:05 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన రాజకీయ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శాసనమండలి సభ్యులుగా (MLCs), ప్రభుత్వ విప్‌లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అద్దంకి దయాకర్ మరియు బల్మూర్ వెంకట్‌లకు ‘రాష్ట్ర మంత్రి హోదా’ (Cabinet Rank status) కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వారిద్దరికీ కేబినెట్ మంత్రులకు అందించే అధికారాలు, ప్రొటోకాల్ మరియు ఇతర సదుపాయాలను కల్పించాలని పౌరసంబంధాలు, సాధారణ పరిపాలన శాఖ అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు. నిజానికి ఈ జీవో (GO) గతంలోనే సిద్ధమైనప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమై, తాజాగా అధికారికంగా విడుదలైంది.
ఈ ఇద్దరు యువ నేతలకు మంత్రి హోదా దక్కడంపై కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి, ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ ఇద్దరూ పార్టీ కోసం తీవ్రంగా శ్రమించారు. విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన బల్మూర్ వెంకట్, అలాగే దళిత, బహుజన గళాన్ని బలంగా వినిపించిన అద్దంకి దయాకర్ ఇద్దరూ అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే వారికి మొదటి నుంచి పార్టీ పట్ల ఉన్న విధేయతకు, వారు పడిన కష్టానికి తగిన గుర్తింపు లభించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి, పార్టీ క్యాడర్‌కు మధ్య మరింత బలమైన సమన్వయం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు.