Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు
- Author : Vamsi Chowdary Korata
Date : 13-07-2026 - 2:09 IST
Published By : Hashtagu Telugu Desk
గోదావరి జలాల వినియోగంతోపాటు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, బనకచర్ల లింక్ ప్రాజెక్టు వంటి అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ఉపశమనం లభించలేదు. తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌లో సాంకేతిక లోపాలను సరిదిద్దే వరకు ఈ పిటిషన్లపై విచారణ చేపట్టడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
గోదావరి జలాలు, బనకచర్ల అనుసంధానం, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంలో మొత్తం 15 మంది ప్రతివాదులు ఉన్నారని కోర్టుకు విన్నవించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పనులపై తాత్కాలిక నిలుపుదల (ఇంజంక్షన్) ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
అయితే.. ప్రధాన పిటిషన్‌లోనే పలు సాంకేతిక లోపాలు ఉన్నాయని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తెలిపింది. అందులో ఉన్న లోపాలను సరిదిద్దకుండా కేసు విచారణను ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని క్లారిటీ ఇచ్చింది. ముందుగా నిబంధనలకు అనుగుణంగా ఆ పిటిషన్‌ను సవరించాలని.. ఆ తర్వాతే కేసులోని ఇతర అంశాలను పరిశీలిస్తామని ధర్మాసనం తేల్చి చెప్పింది.
ఇక.. పిటిషన్‌ను విచారణకు స్వీకరించకముందే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం లేదా ఈ వ్యవహారంలో తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వడం న్యాయపరంగా సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో రెండు రాష్ట్రాల నదీ జలాల విషయంలో తక్షణమే స్టే ఇవ్వడంతోపాటు.. ఏపీ సర్కార్‌కు నోటీసులు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
మరోవైపు.. ఆ పిటిషన్‌లోని లోపాలను సరిచేసిన తర్వాత తిరిగి దానిపై విచారణ చేపట్టి.. మిగిలిన న్యాయపరమైన అంశాలపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో పోలవరం ప్రాజెక్టు, గోదావరి జలాల వినియోగం, బనకచర్ల అనుసంధానానికి సంబంధించిన వివాదంలో ఏం జరగనుంది అనే పరిణామాలపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల దృష్టి సుప్రీంకోర్టు తదుపరి విచారణపైనే నిలిచింది.