Shubman Gill: ‘నెవర్ గివ్ అప్’.. ఓవల్ టెస్ట్ విజయం తర్వాత గిల్ కీలక వ్యాఖ్యలు..!
ఈ ఆరు వారాల సిరీస్ నుంచి తాను ఏమి నేర్చుకున్నారని అడిగిన ప్రశ్నకు గిల్ "ఎప్పుడూ వదులుకోకూడదు" (Never Give Up) అని సమాధానమిచ్చాడు. చివరి టెస్ట్‌లో ఈ స్ఫూర్తి స్పష్టంగా కనిపించింది.
- By Gopichand Published Date - 09:16 PM, Mon - 4 August 25

Shubman Gill: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ అసాధారణమైన పోరాట పటిమను కనబరిచి, ఇంగ్లండ్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయం తర్వాత భారత యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) జట్టు ప్రదర్శనపై, ముఖ్యంగా బౌలర్ల కృషిపై సంతృప్తి వ్యక్తం చేశాడు.
కెప్టెన్ గిల్ ప్రశంసలు
విజయం అనంతరం పోస్ట్-మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో గిల్ మాట్లాడుతూ.. ఈ సిరీస్ మొత్తం రెండు జట్లు అద్భుతమైన క్రికెట్ ఆడాయని ప్రశంసించాడు. “రెండు జట్లు తమ అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచాయి. ఈ రోజు విజయం సాధించడం మాకు చాలా సంతోషంగా ఉంది” అని గిల్ అన్నాడు.
మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి బౌలర్లు ఉన్నప్పుడు కెప్టెన్సీ చాలా సులభం అవుతుందని గిల్ పేర్కొన్నాడు. “సిరాజ్ ఒక కెప్టెన్ కలలోని బౌలర్. అతను ప్రతి బంతికి, ప్రతి స్పెల్‌లో తన సర్వస్వం అర్పించాడు. అలాగే, ప్రసిద్ధ్ కృష్ణ కూడా వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు” అని గిల్ ప్రశంసించాడు. 2-2 స్కోర్‌లైన్ ఈ సిరీస్‌లో రెండు జట్లు ప్రదర్శించిన క్రికెట్ నాణ్యతకు, పోరాట స్ఫూర్తికి న్యాయం చేస్తుందని గిల్ అభిప్రాయపడ్డాడు.
Also Read: Chiranjeevi: నా కోడలు.. ఉపాసనపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్!
‘నెవర్ గివ్ అప్’ స్ఫూర్తి
ఈ ఆరు వారాల సిరీస్ నుంచి తాను ఏమి నేర్చుకున్నారని అడిగిన ప్రశ్నకు గిల్ “ఎప్పుడూ వదులుకోకూడదు” (Never Give Up) అని సమాధానమిచ్చాడు. చివరి టెస్ట్‌లో ఈ స్ఫూర్తి స్పష్టంగా కనిపించింది. ఐదవ రోజు ఇంగ్లండ్ విజయానికి కేవలం 35 పరుగులు అవసరం కాగా, భారత్‌కు నాలుగు వికెట్లు కావాలి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత్ జట్టు పట్టు వదలకుండా పోరాడి, ఇంగ్లండ్‌ను కేవలం 6 పరుగుల తేడాతో ఓడించింది.
గిల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు
ఈ సిరీస్‌లో అత్యధికంగా 754 పరుగులు చేసి, నాలుగు సెంచరీలు సాధించిన శుభ్‌మన్ గిల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ప్రదర్శన తన బ్యాటింగ్ పరిణతిని సంతృప్తికరంగా చూపిందని గిల్ పేర్కొన్నాడు.