విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్.. వెనుక పెద్ద ప్లానింగే ?
- Author : Vamsi Chowdary Korata
Date : 27-12-2025 - 11:14 IST
Published By : Hashtagu Telugu Desk
ROHIT SHARMA AT VIJAY HAZARE TROPHY : విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మను తొలి బంతికే ఔట్ చేయడం వెనుక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందని బౌలర్ దేవేంద్ర సింగ్ బోరా చెప్పాడు. రిస్క్ తీసుకుని బౌన్సర్ వేయాలని ముందే నిర్ణయించుకున్నామని, ఫైన్ లెగ్‌లో ఫీల్డర్‌ను ఉంచి ప్లాన్ సక్సెస్ చేశామని తెలిపాడు. ఈ అనూహ్య వికెట్ బోరాను ఒక్కసారిగా హైలైట్ చేసింది. సిక్కింతో జరిగిన తొలి మ్యాచ్‌లో హిట్ మ్యాన్ 94 బంతుల్లో 155 పరుగులు చేయగా, ఉత్తరాఖండ్‌పై డకౌట్ అయ్యాడు.
- ఉత్తరాఖండ్‌పై తొలి బంతికే రోహిత్ అవుట్
- బౌన్సర్ వేయాలని ముందుగానే అనుకున్నామన్న బౌలర్
- కోచ్, కెప్టెన్ పక్కా ప్లాన్‌తో రోహిత్ శర్మ అవుట్
విజయ్ హజారే ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ , రెండో మ్యాచ్‌లో ఫస్ట్ బంతికే డకౌట్ అయ్యాడు. అయితే, హిట్‌మ్యాన్‌ని గోల్డెన్ డక్ చేయించడం వెనుక పెద్ద మాస్టర్ ప్లానే ఉందని బౌలర్ చెప్పేశాడు. చాలా పెద్ద రిస్క్ తీసుకున్నామని, చివరికి తాము అనుకున్నట్టే రోహిత్ శర్మ అవుటయ్యాడని హిట్ మ్యాన్‌ను అవుట్ చేసిన బౌలర్ తెలిపాడు.
సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో 94 బంతుల్లో 155 పరుగులు చేసిన రోహిత్, ఈ మ్యాచ్‌లో మాత్రం గోల్డెన్ డక్‌తో వెనుదిరగాల్సి వచ్చింది.ఈ అనూహ్య వికెట్ వెనుక ఉన్న అసలు ప్లాన్‌ను ఉత్తరాఖండ్ యువ పేసర్ దేవేంద్ర సింగ్ బోరా మ్యాచ్ అనంతరం బయటపెట్టాడు. రోహిత్‌ను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో కోచ్, కెప్టెన్ ముందుగానే స్పష్టమైన వ్యూహం సిద్ధం చేసుకున్నారని తెలిపాడు.
రోహిత్‌పై తొలి బంతికే బౌన్సర్ వేయాలని ముందే నిర్ణయించుకున్నామని బోరా వెల్లడించాడు. ఆ బంతి సిక్స్‌గా వెళ్లే ప్రమాదం ఉందని తెలిసినా, అదే బంతితో ఛాన్స్ క్రియేట్ చేయాలన్నదే తమ ఉద్దేశమని చెప్పాడు. “మ్యాచ్‌కు ముందు కోచ్, కెప్టెన్‌తో మాట్లాడి రోహిత్‌కు తొలి బంతికే బౌన్సర్ వేయాలని ప్లాన్ చేశాం. అతను బౌన్సర్‌ను బాగా ఆడతాడు. అది సిక్స్‌గా వెళ్లే రిస్క్ ఉందని మాకు తెలుసు. అయినా తొలి బంతికే అటాక్ చేస్తే అవకాశం వస్తుందని భావించాం” అని బోరా చెప్పాడు.
ఈ ప్లాన్ ప్రకారమే ఫైన్ లెగ్‌లో ఫీల్డర్‌ను కూడా ప్రత్యేకంగా ఉంచినట్లు బోరా స్పష్టం చేశాడు. అదే చోట రోహిత్ క్యాచ్ ఔట్ కావడంతో ఉత్తరాఖండ్ వ్యూహం పర్ఫెక్ట్గా పనిచేసింది. ముంబై లాంటి బలమైన జట్టుపై రోహిత్ వికెట్ తీసిన దేవేంద్ర బోరా పేరు ఒక్కసారిగా హైలైట్ అయ్యింది. అయితే అతనికి లిస్ట్-ఏ అనుభవం చాలా తక్కువే. ఈ మ్యాచ్‌కు ముందు కేవలం రెండు లిస్ట్-ఏ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
ఈ సీజన్లో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన తొలి విజయ్ హజారే మ్యాచ్‌లో తన నాలుగు వికెట్లన్నీ బోరానే తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. రెడ్ బాల్ క్రికెట్లో మాత్రం అతనికి మంచి అనుభవం ఉంది. ఇప్పటివరకు 15 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడి, 30 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో బెంగాల్‌పై 6/79 ఫిగర్స్ నమోదు చేయడం అతని కెరీర్లో ఇప్పటివరకు బెస్ట్ ప్రదర్శనగా నిలిచింది.