IND vs SA: టీమిండియాపై గవాస్కర్ కీలక వ్యాఖ్యలు
సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో తొలి రోజు దక్షిణాఫ్రికా పేస్ దళం భారత బ్యాటర్లకు గట్టి షాకిచ్చింది. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ ఐదు వికెట్లతో విజృంభించాడు.
- Author : Praveen Aluthuru
Date : 27-12-2023 - 4:15 IST
Published By : Hashtagu Telugu Desk
IND vs SA: సెంచూరియన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో తొలి రోజు దక్షిణాఫ్రికా పేస్ దళం భారత బ్యాటర్లకు గట్టి షాకిచ్చింది. దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబడ ఐదు వికెట్లతో విజృంభించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.
ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 5, యశస్వి జైశ్వాల్ 17, శుభ్‌మన్ గిల్ 2 పరుగులతో నిరాశపరిచారు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వెటరన్ ఆటగాడు అజింక్యా రహానే జట్టులో ఉండాల్సింది. విదేశీ పిచ్ లపై రహానేకు అపారమైన అనుభవం ఉంది. అతను ఈ టెస్టు సిరీస్ లో ఉండి ఉంటే కథ మరోలా ఉండేదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో 2018-19 జోహన్నెస్‌బర్గ్ టెస్టు మ్యాచ్ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బౌలర్లు అద్భుతంగ బౌలింగ్ చేస్తున్నారు. అక్కడ బౌన్సీ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. అయితే రహానే అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించాడు. తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన రహానే.. మూడో టెస్టుకు జట్టులోకి వచ్చి టీమ్ ఇండియాకు కీలకమైన 48 పరుగులు చేశాడు అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ పేర్కొన్నాడు.
ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రహానే చివరిసారిగా భారత్ తరఫున ఆడాడు. ఈ సిరీస్‌లో రహానె తీవ్ర నిరాశపరిచాడు. రెండు టెస్టుల్లో 11 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో సౌతాఫ్రికా సిరీస్‌కు రహానెను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు.
Also Read: YS Jagan Mohan Reddy: చిత్తూరు జిల్లాలో మారనున్న వైసీపీ సీట్లు ఇవే